కడప సెవెన్‌రోడ్స్ : ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)ను పారదర్శకంగా, అత్యంత పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ సభా భవనంలో ఈఆర్‌ఓలు, ఏఈఆర్‌ఓలు, ఈడీటీలు, సూపర్‌వైజర్లు, బీఎల్‌ఓలకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. తరుచూ ప్రజలు వలసలు వెళ్లడం, ఒకే వ్యక్తి పేరు పలు ప్రాంతాల్లో నమోదు కావడం, మరణించిన వారి పేర్లు తొలగించకపోవడం వంటి సమస్యలను పరిష్కరించేందుకే సర్ కార్యక్రమాన్ని చేపడుతున్నామన్నారు. ఎన్యుమరేషన్ దశలో బీఎల్‌ఓలు ప్రతి ఇంటికి వెళ్లి ఫారాలు పంపిణీ చేయాలన్నారు. పూర్తి చేసిన ఫారాలను స్వీకరించి డిజటలైజేషన్ చేయాలన్నారు. ఇంటికి తాళం వేసి ఉంటే మూడుసార్లు సందర్శించి ఫారం అందించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఎవరి ఓటునైనా విచారణ నిర్వహించిగానీ తొలగించడానికి వీలుండదని స్పష్టం చేశారు. ఎస్‌ఐఆర్‌లో ఎక్కడైనా అవకతవకలు జరిగితే చర్యలు తప్పవని హెచ్చరించారు. రాజంపేట సబ్ కలెక్టర్ హెచ్‌ఎస్ భావన, డీఆర్వో మల్లికార్జునుడు తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి


