జేఈఈ మెయిన్‌లో 300కు 300 మార్కులు
జమ్మలమడుగు రూరల్ : జేఈఈ మెయిన్‌లో వైఎస్సార్ కడప జిల్లా జమ్మలమడుగు పట్టణానికి చెందిన పసల మోహిత్ 300 మార్కులకు గాను 300 మార్కులు సాధించాడు. గత నెల 22, 23 తేదిల్లో జేఈఈ మెయిన్స్ నిర్వహించారు. బుధవారం జేఈఈ మెయిన్ పరీక్షకు సంబంధించిన ప్రాథమిక కీ జాతీయ పరీక్షల సంస్థ (ఎన్‌టీఏ) ఫలితాలు ప్రకటించి వెబ్‌సైట్‌లో ఉంచారు. పసల మోహిత్ 22వ తేదీన జరిగిన పరీక్షలో 300కు 300మార్కులు వచ్చినట్లు తల్లి సబిత తండ్రి కిరణ్‌లు తెలిపారు. తల్లిదండ్రులు డాక్లర్లు కావడం విశేషం. ఇప్పటికి అందిన వివరాల మేరకు రాష్ట్రంలో జేఈఈలో అత్యధిక మార్కులు తమ కుమారుడు సాధించడం ఆనందంగా ఉందని వారు తెలిపారు. పసల మోహిత్ 10వ తరగతి కెకెఆర్ గౌతం పాఠశాలలో చదివాడు. ఇంటర్ విజయవాడలోని శ్రీ చైతన్య కళాశాలలో చదువుతున్నాడని తెలిపారు.
చేపల చెరువు పరిశీలన
చాపాడు : మండల పరిధిలోని కుచ్చుపాప గ్రామ సమీపంలో ఉన్న మాజీ ఎమ్మెల్యే ఎస్.రఘురామిరెడ్డికి సంబంధించిన చేపల చెరువులను గురువారం రెవెన్యూ, ఫిషరీస్ అధికారులు పరిశీలించారు. ఐదారేళ్లుగా సాగులో ఉన్న చేపల చెరువులను ఆర్టీఓ సాయిశ్రీ, ఫిషరీస్ ఏడీ రవికుమార్, ఏడీ సర్వేయర్ శాంతరాజు పరిశీలించారు. గతం వారం ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ చేపల చెరువులకు ఎలాంటి అనుమతులు లేవని జాయింట్ కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. జిల్లా అధికారుల ఆదేశాల మేరకు చేపల చెరువులను అధికారులు పరిశీలించినట్లు తహసీల్దార్ రమాకుమారి తెలిపారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ రెండు మూడు రోజుల్లో పూర్తి స్థాయి నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తారని తెలిపారు. కార్యక్రమంలో ఎఫ్‌డీఓ బాలరాజు, వీహెచ్‌ఏ శ్రీనివాసులు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
జేఈఈ మెయిన్‌లో 300కు 300 మార్కులు


