వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు
మహారాణిపేట: స్టీల్‌ప్లాంట్ ప్రమాద బాధితులను పరామర్శించిన సమయంలో కార్మిక సంఘాల నాయకులపై మంత్రి నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలను వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు తీవ్రంగా ఖండించారు. మంగళవారం కేజీహెచ్‌లో మృతుల కుటుంబాలను వైఎస్సార్‌సీపీ నేతలు బొత్స సత్యనారాయణ, కురసాల కన్నబాబు, గుడివాడ అమర్‌నాథ్‌లతో కలిసి పరామర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ రెండేళ్లలో 6 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులను తొలగించి, పని భారాన్ని రెట్టింపు చేయడం వల్లే ఈ ఘోర ప్రమాదం జరిగిందని, ఇవి ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలేనని ఆరోపించారు. ప్రమాదానికి గత ప్రభుత్వానికి ముడిపెడుతూ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడటం ఆయన అవగాహనారాహిత్యానికి నిదర్శనమన్నారు. నాడు సీఎం వైఎస్ జగన్ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేసి, ప్రధానికి లేఖలు రాశారని గుర్తుచేశారు. కేంద్రంతో మాట్లాడి ప్రైవేటీకరణను ఆపలేని కూటమి నాయకులు తమ చేతకానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికే కార్మిక సంఘాలపై, వైఎస్ జగన్‌పై ఫ్రస్ట్రేషన్‌తో విమర్శలు గుప్పిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.


