ఉక్కు ప్రమాదంపై
రాష్ట్ర కార్మిక శాఖమంత్రి సుభాష్
గాజువాక : సుమారు 140 టన్నుల లాడెల్‌లోని లిక్విడ్ స్టీల్‌లో ఆర్గానిక్ గ్యాస్ మిక్స్ కాకపోవడం వల్లే విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ఘోర ప్రమాదం జరిగి ఉండవచ్చని తాము భావిస్తున్నామని రాష్ట్ర కార్మిక శాఖా మంత్రి వాసంశెట్టి సుభాష్ చెప్పారు. స్థానిక కిమ్స్ ఐకాన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఉక్కు ప్రమాద బాధితులను మంగళవారం ఆయన పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. లాడెల్‌లో ఎటువంటి సమస్య లేదని, అందులో సమస్య ఉండి ఈ ప్రమాదం జరిగితే అక్కడ ఎవరూ మిగలరన్నారు. లాడెల్‌లో ఆర్గానిక్ గ్యాస్ మిక్స్ అవకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందన్నారు. ఆర్గానిక్ గ్యాస్ పైప్‌లో చిన్న పొరపాటు వల్ల సెకండ్స్ వ్యవధిలో ఇది పేలిపోయిందని చెప్పారు. లాడెల్‌లో 150 టన్నుల వరకు లిక్విడ్‌ను నింపుతారని, అందులో ఆర్గానిక్ గ్యాస్‌ను మిక్స్ చేస్తారన్నారు. లాడెల్‌లో లిక్విడ్ స్టీల్ రియాక్ట్ కాకుండా కార్బన్ మోనాక్సయిడ్, కార్బన్ డయాక్సయిడ్‌లను ఆర్గానిక్ గ్యాస్ బ్యాలెన్స్ చేస్తుందన్నారు. ఆర్గానిక్ గ్యాస్ అందులో మిక్స్ కాకపోవడంతో 1500 డిగ్రీల వేడి ఉన్న లిక్విడ్ వర్షం మాదిరిగా మనుషులపై పడి ఈ ప్రమాదం చోటు చేసుకుందన్నారు. అయితే, ఈ విచారణ ఇంకా ప్రాథమిక దశలోనే ఉందన్నారు. కార్మికుల సంఖ్య, యంత్రాల నిర్వహణ విషయంలో కార్మిక సంఘాల నేతలు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. ప్రమాదం జరిగిన సమయంలో అవసరమైన సంఖ్యలోనే కార్మికులు విధుల్లో ఉన్నారన్నారు. ప్లాంట్‌లో భద్రతా ప్రమాణాలకనుగుణంగా క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించామన్నారు. గత ఏడాది నవంబర్‌లో కూడా స్పెషల్ టీమ్‌తో తనిఖీ చేశామన్నారు.


