ఉక్కునగరం : స్టీల్‌ప్లాంట్ ఎస్‌ఎంఎస్ విభాగంలో జరిగిన ప్రమాదం అత్యంత దురదృష్టకరమని కేంద్ర ఉక్కు శాఖ సహాయమంత్రి బి. శ్రీనివాసవర్మ అన్నారు. స్టీల్‌ప్లాంట్ సీఎండీ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రమాదం విషయం తెలిసిన వెంటనే కేంద్ర ఉక్కు మంత్రి హెచ్‌డీ కుమారస్వామి సంఘటన స్థలాన్ని సందర్శించి బాధితులకు భరోసా కల్పించారని తెలిపారు. బాధిత కుటుంబాలకు యాజమాన్యం అన్ని విధాలా అండగా ఉంటుందన్నారు. ఇద్దరు క్షతగాత్రుల పరిస్థితి విషమంగా ఉండటంతో అవసరమైతే ఎయిర్ అంబులెన్స్ ద్వారా తరలించే ఏర్పాట్లు చేశామని చెప్పారు. ఉద్యోగులు అధైర్యపడవద్దని, ప్రభుత్వం వారికి అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ప్రమాదంపై నియమించిన కమిటీ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. సమావేశంలో ఎంపీ శ్రీభరత్, స్టీల్‌ప్లాంట్ సీఎండీ ఎం.ఎన్.వి.ఎస్. ప్రభాకర్ పాల్గొన్నారు.


