సాక్షి, విశాఖపట్నం: సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమలను( ఎంఎస్‌ఎంఈ) ప్రోత్సహించాలనే లక్ష్యంతో వేల కోట్ల బడ్జెట్‌తో కేంద్రం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక (ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్,(పీఎల్‌ఐ) పథకం ఎంఎస్‌ఎంఈల దరి చేరలేదు. కఠినమైన నిబంధనలు విధించడం వల్ల పీఎల్‌ఐ అందుకోలేదు సరికదా ఎంఎస్‌ఎంఈలు తీవ్రంగా నష్టపోయాయి. ఈ విషయాన్ని గుర్తించిన కేంద్రం ఈసారి ఎంఎస్‌ఎంఈలకు ‘ఆధారం’గా నిలిచేందుకు సిద్ధమవుతోంది. పరిశ్రమల్లో వృథాగా మిగిలిపోతున్న 60 శాతం ఉత్పత్తి సామర్థ్యాన్ని వినియోగంలోకి తీసుకురావడంతో పాటు వాల్యూ యాడెడ్ సముద్ర ఉత్పత్తుల మార్కెట్‌లో భారత వాటాను పెంచేందుకు పీఎల్‌ఐ–2.0కి ప్రణాళికలు రూపొందించింది. స్పెషాలిటీ ఉత్పత్తులకు 20 శాతం ప్రోత్సాహకాలు అందిస్తూ.. గ్లోబల్ మార్కెట్‌లో భారతీయ ఉత్పత్తుల వాటా పెంచేందుకు వీలుగా నూతన కొత్త మార్గదర్శకాలు రూపొందించింది. నూతన పాలసీతోనైనా ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలు అంది..దశ తిరిగేనా అని ఎంఎస్‌ఎంఈల నిర్వాహకులు ఆశలపల్లకిలో విహరిస్తున్నారు. మరో వైపు ఈ నిర్ణయాలు దేశీయఫుడ్ ప్రాసెసింగ్ రంగానికి మహర్దశ పడుతుందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. విశాఖలో జరుగుతున్న జాతీయ సముద్ర ఉత్పత్తుల సదస్సులో ఈ అంశాలపై సుదీర్ఘ చర్చ జరిగింది.
ఎంఎస్‌ఎంఈలకు గుది బండగా ప్రస్తుత పీఎల్‌ఐ నిబంధనలు
కేంద్రం భారీగా ప్రోత్సాహకాలు ప్రకటించినా అందుకోలేని వైనం
నిబంధనలు మార్చాలని ఎంఎస్‌ఎంఈల ప్రతినిధుల వేడుకోలు
ఫలితంగా ఫుడ్ ప్రాసెసింగ్‌లో పీఎల్.2.0 దిశగా అడుగులు
నిబంధనల సడలింపుతో కస్టమైజ్డ్ పీఎల్‌ఐలు తీసుకొస్తున్న కేంద్రం
స్పెషాలిటీ ఉత్పత్తులకు అత్యధికంగా 20 శాతం ప్రోత్సాహకాలు
గ్లోబల్ మార్కెట్‌లో భారతీయ ఉత్పత్తుల వాటా
2030 నాటికి 25 శాతానికి పెంచడం లక్ష్యం
ముడిసరకు
దిగుమతికి ఊరట
భౌగోళిక రాజకీయ పరిస్థితులు, టారిఫ్‌లు, నీటి సమస్యల కారణంగా 5 శాతం కనీస వార్షిక వృద్ధి రేటు(సీఏజీఆర్) సాధించలేని పరిశ్రమలు సంబంధిత డేటా సమర్పిస్తే, నిబంధనలు సడలించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. పూర్తిస్థాయి ఉత్పత్తి సాధించడానికి వీలుగా మైరెన్ ఉత్పత్తుల తయారీకి అవసరమైన ముడిసరుకు దిగుమతులపై ఇటీవల కొంత వెసులుబాటు కల్పించింది. నాణ్యతను పెంచేందుకు 2024–25 బడ్జెట్‌లో 100 ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్‌లు ఏర్పాటుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. పీఎంకేఎస్‌వై కింద ఒక్కో ల్యాబ్‌కు రూ.5 కోట్ల వరకు గ్రాంట్–ఇన్–ఎయిడ్ లభించనుంది. ప్రపంచ వాణిజ్య సంస్థ(డబ్ల్యూటీవో) నిబంధనల ప్రకారం ఎగుమతులపై నేరుగా ప్రోత్సాహకాలు ఇవ్వడానికి అవకాశం లేకపోవడం వల్ల పరోక్ష మార్గాల ద్వారా లబ్ధి చేకూర్చే అంశాలను అధికారులు పరిశీలిస్తున్నారు.


