మళ్లీ షాక్‌..! | - | Sakshi
Sakshi News home page

మళ్లీ షాక్‌..!

Jun 8 2026 10:11 AM | Updated on Jun 8 2026 10:11 AM

సామాన్యుడికి
పెరిగిన వంట గ్యాస్‌ ధర సిలిండర్‌పై రూ.29 పెంపు

మహారాణిపేట: ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు, విద్యుత్‌ చార్జీలు, ఇంధన ధరల పెరుగుదలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న సామాన్య ప్రజలకు కేంద్ర ప్రభుత్వం మరోసారి షాక్‌ ఇచ్చింది. గృహ వినియోగ ఎల్పీజీ (వంట గ్యాస్‌) సిలిండర్‌ ధరను రూ.29 మేర పెంచుతూ ప్రభుత్వ రంగ చమురు మార్కెట్‌ సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. పెరిగిన ధరలు ఆదివారం నుంచే జిల్లాలో అమల్లోకి వచ్చాయని అధికారులు వెల్లడించారు. 14.2 కిలోల గృహ వినియోగ సిలిండర్లపై ఈ వడ్డన వర్తించనుంది. తాజా పెంపుతో విశాఖలో ఇప్పటివరకు రూ.921 ఉన్న గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ.950కి చేరింది. దీనికి గ్యాస్‌ బాయ్‌ చార్జీలు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. స్థానిక పన్నులు, రవాణా ఖర్చుల ఆధారంగా ప్రాంతాల వారీగా ఈ ధరల్లో స్వల్ప మార్పులు ఉండవచ్చని అధికారులు తెలిపారు.

మూడు నెలల్లో రెండోసారి

గత మూడు నెలల వ్యవధిలో వంట గ్యాస్‌ ధరలు పెరగడం ఇది రెండోసారి. ఈ ఏడాది మార్చి నెలలో కూడా గ్యాస్‌ ధరలు పెరిగిన విషయం తెలిసిందే. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల హెచ్చుతగ్గులు, దిగుమతి వ్యయాల పెరుగుదల, చమురు సంస్థల ఆర్థిక పరిస్థితుల కారణంగానే ధరలను సవరించినట్లు కంపెనీలు చెబుతున్నప్పటికీ, వినియోగదారుల నుంచి మాత్రం తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఇప్పటికే కూరగాయలు, సరుకుల ధరలు ఆకాశాన్నంటుతున్న వేళ, విద్యా, వైద్య ఖర్చులు పెరిగి సామాన్యుడి జీవితం భారంగా మారిన తరుణంలో వంట గ్యాస్‌ ధర పెంచడం మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి కుటుంబాల బడ్జెట్‌ను అతలాకుతలం చేయనుంది.

రూ.కోట్లలో అదనపు భారం

తాజా ధరల పెంపుతో జిల్లాలోని వినియోగదారులపై నెలకు రూ.29 చొప్పున భారీగా అదనపు భారం పడనుంది. జిల్లాలోని మొత్తం 8,90,341 కనెక్షన్లను ప్రాతిపదికగా తీసుకుంటే, వినియోగదారులపై నెలకు రూ.2,58,19,889 చొప్పున.. ఏడాదికి సుమారు రూ.30,98,38,668 మేర అదనపు భారం పడనుంది. నిత్యం వంటింటి బడ్జెట్‌తో సతమతమయ్యే పేద, మధ్యతరగతి కుటుంబాల నడ్డి విరిచేలా ఉన్న ఈ ధరల పెంపుపై కేంద్ర ప్రభుత్వం పునరాలోచించాలని ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు.

జిల్లాలో గ్యాస్‌ కనెక్షన్ల వివరాలు..

జిల్లా వ్యాప్తంగా మొత్తం 45 గ్యాస్‌ ఏజెన్సీలు ఉన్నాయి. వీటిలో అర్బన్‌ పరిధిలో 42, రూరల్‌ పరిధిలో 3 ఏజెన్సీలు నడుస్తున్నాయి. జిల్లాలో మొత్తం గ్యాస్‌ కనెక్షన్ల సంఖ్య 8,90,341 గా ఉంది. ఇందులో సింగిల్‌ సిలిండర్‌ కనెక్షన్లు 2,24,604, డబుల్‌ సిలిండర్‌ కనెక్షన్లు 5,33,988 కాగా, దీపం పథకం కనెక్షన్లు 1,31,749 ఉన్నాయి. కాగా, జిల్లాలో మొత్తం 5,12,619 మంది తెల్ల రేషన్‌ కార్డుదారులు ఉన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement