సర్‌ ఫోకస్‌ | - | Sakshi
Sakshi News home page

సర్‌ ఫోకస్‌

Jun 8 2026 10:11 AM | Updated on Jun 8 2026 10:11 AM

● ఓటర్ల మ్యాపింగ్‌పై ప్రత్యేక దృష్టి ● సెప్టెంబర్‌ 22న తుది ఓటర్ల జాబితా ● ఓటు హక్కు కోసం మ్యాపింగ్‌ తప్పనిసరి

ఓటరు జాబితాపై

మహారాణిపేట: నిర్దిష్టమైన, పారదర్శకమైన ఓటరు జాబితా రూపకల్పన కోసం జిల్లా యంత్రాంగం ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమానికి సిద్ధమవుతోంది. కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన షెడ్యూల్‌కు అనుగుణంగా ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా ఈ నెల 15 నుంచి జూలై 14 వరకు బూత్‌ స్థాయి అధికారులు ఇంటింటికీ వెళ్లి ఎన్యూమరేషన్‌ ఫారాలను పంపిణీ చేసి, ఓటర్ల నుంచి పూర్తి వివరాలను సేకరించనున్నారు. అలాగే ప్రస్తుత ఓటరు జాబితాలో ఉన్నవారు ఆయా ప్రాంతాల్లో నివసిస్తున్నారా లేదా అనే అంశాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలిస్తారు.

ఈ కార్యక్రమానికి సంబంధించి జూన్‌ 5 నుంచి 14 వరకు క్షేత్రస్థాయి సిబ్బందికి ప్రత్యేక శిక్షణ నిర్వహిస్తున్నారు. అనంతరం జూలై 14న పోలింగ్‌ కేంద్రాల రేషనలైజేషన్‌ చేపట్టి, జూలై 21న ముసాయిదా ఓటర్ల జాబితాను విడుదల చేస్తారు. జూలై 21 నుంచి ఆగస్టు 20 వరకు అభ్యంతరాలు, కొత్త ఓటర్ల నమోదు దరఖాస్తులను స్వీకరిస్తారు. అందిన దరఖాస్తులు, అభ్యంతరాలను సెప్టెంబర్‌ 18లోపు పరిష్కరించనున్నారు. ముసాయిదా జాబితా విడుదలైన తర్వాత 2002 ఓటర్ల జాబితాతో సరిపోలని వివరాలు ఉన్నవారికి ఓటరు నమోదు అధికారులు నోటీసులు జారీ చేస్తారు. ఈ జాబితాలను అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ప్రకటిస్తారు. అయితే ముసాయిదా జాబితాలో ఉన్న ఏ ఓటరు పేరునూ విచారణ లేకుండా లేదా వివరణకు అవకాశం ఇవ్వకుండా తొలగించబోమని అధికారులు స్పష్టం చేస్తున్నారు. అన్ని ప్రక్రియలు పూర్తయిన అనంతరం సెప్టెంబర్‌ 22న తుది ఓటర్ల జాబితాను ప్రకటిస్తారు.

కీలకంగా మారనున్న మ్యాపింగ్‌

ఈ సవరణలో ఓటర్ల వివరాల మ్యాపింగ్‌ కీలకంగా మారింది. మ్యాపింగ్‌ పూర్తికాని పక్షంలో ఓటు హక్కు కోల్పోయే అవకాశం ఉండటంతో అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ప్రస్తుతం ఈ ప్రక్రియ కొనసాగుతోంది. ఇంకా మ్యాపింగ్‌ కాని వారు సంబంధిత బీఎల్వోలను సంప్రదించి వెంటనే పూర్తి చేసుకోవాలని సూచిస్తున్నారు. అనంతరం బీఎల్వోలు అందజేసే ఫారాలను నింపి తిరిగి సమర్పించాల్సి ఉంటుంది.

నిర్లక్ష్యానికి తావులేకుండా...

టరు జాబితా ప్రజాస్వామ్యానికి మూలస్తంభం. అందుకే 100 శాతం ఓటర్ల మ్యాపింగ్‌ లక్ష్యంగా జిల్లా యంత్రాంగం చర్యలు చేపడుతోంది. ప్రతి కుటుంబంలోని అర్హులైన ఓటర్ల వివరాలను సక్రమంగా నమోదు చేయడం ద్వారా ఓటరు జాబితా మరింత పారదర్శకంగా రూపొందే అవకాశం ఉంది. ముఖ్యంగా నేవీ, స్టీల్‌ప్లాంట్‌, షిప్‌యార్డు, రైల్వే వంటి సంస్థల ఉద్యోగుల వివరాల కోసం ప్రత్యేక అధికారులను నియమించాం. ఈ ప్రక్రియలో అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యానికి తావివ్వకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. ఓటు హక్కు పరిరక్షణకు సంబంధించిన అంశం కావడంతో ఎన్నికల సంఘం మార్గదర్శకాలను కచ్చితంగా అమలు చేయాల్సిన అవసరం ఉంది.

– ఎం.అభిషిక్త్‌ కిశోర్‌, కలెక్టర్‌ విశాఖ

ప్రస్తుత జిల్లా ఓటర్లు 20,23,009

ప్రస్తుతం జిల్లాలో 20,23,009 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 12,76,527 మందికి మ్యాపింగ్‌ పూర్తికాగా, ఇది మొత్తం ఓటర్లలో 63.10 శాతం. ఇంకా 7,46,482 మంది ఓటర్లకు మ్యాపింగ్‌ జరగాల్సి ఉంది. వీరంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ ఓటు హక్కును పరిరక్షించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement