మన అద్దాల రైలుకు అరుదైన గుర్తింపు | - | Sakshi
Sakshi News home page

మన అద్దాల రైలుకు అరుదైన గుర్తింపు

Jun 8 2026 10:11 AM | Updated on Jun 8 2026 10:11 AM

దేశంలోనే నం.1 పర్యాటక రైలు మార్గంగా ఎంపిక ఇండియాటుడే అవార్డుల జాబితాలో చోటు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో పూర్తి విస్టాడోమ్‌ రైలు ప్రారంభం

సాక్షి, విశాఖపట్నం: అద్దాల రైలులో అరుదైన పర్యాటక మార్గం.. సరికొత్త మైలురాయిని అందుకుంది. ప్రముఖ మీడియా సంస్థ ‘ఇండియా టుడే’ నిర్వహించిన నేషనల్‌ టూరిజం సర్వేలోని ‘ఇండియన్‌ రూట్స్‌’ ఎడిటర్స్‌ ఛాయిస్‌ విభాగంలో విశాఖ–అరకు విస్టాడోమ్‌ రైలు ప్రయాణం దేశంలోనే అత్యుత్తమ పర్యాటక రైలు మార్గంగా అగ్రస్థానంలో నిలిచింది. తూర్పు కనుమల ప్రకృతి సోయగాలు, సొరంగ మార్గాలు, పచ్చని లోయలు, జలపాతాల మధ్య ఆహ్లాదకరంగా సాగే ఈ రైలు ప్రయాణం పర్యాటకులను విశేషంగా ఆకట్టుకోవడంతో ఈ అవార్డు దక్కింది. జూన్‌ 15న గోవాలో జరగనున్న ‘ఇండియా టుడే టూరిజం సమ్మిట్‌ అండ్‌ అవార్డ్స్‌–2026’ కార్యక్రమంలో ఈ ప్రతిష్టాత్మక అవార్డును అందించనున్నారు. విశాఖ– అరకు మార్గంలో పర్యాటకుల కోసం మొట్టమొదటి విస్టాడోమ్‌ (అద్దాల బోగీ) కోచ్‌ను 2017 ఏప్రిల్‌ 16న అప్పటి రైల్వే మంత్రి సురేష్‌ ప్రభు లాంఛనంగా ప్రారంభించారు. ఇది దేశంలోనే మొట్టమొదటి విస్టాడోమ్‌ కోచ్‌. ఆ తర్వాత పర్యాటకుల నుంచి వచ్చిన విశేష స్పందన, డిమాండ్‌ మేరకు ఈ మార్గంలో గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో విస్టాడోమ్‌ కోచ్‌ల సంఖ్యను పెంచుతూ వచ్చారు. అనంతరం, పూర్తి స్థాయి అత్యాధునిక ఎల్‌ హెచ్‌ బి విస్టాడోమ్‌ కోచ్‌లతో అప్‌గ్రేడ్‌ చేసిన రైలు (విశాఖ–కిరండూల్‌ ఎక్స్‌ప్రెస్‌)ని 2021 నవంబర్‌ 22న ప్రారంభించారు. అప్పటి నుంచి ఈ రైలు మార్గానికి విశేష స్పందన లభిస్తోంది. ప్రతి ప్రయాణంలో 100 శాతం ఆక్యుపెన్సీతో ఈ రైలు నడుస్తోందని విశాఖపట్నం డివిజన్‌ రైల్వే అధికారులు తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement