పోలింగ్‌ కేంద్రాలపై అభ్యంతరాల స్వీకరణ | - | Sakshi
Sakshi News home page

పోలింగ్‌ కేంద్రాలపై అభ్యంతరాల స్వీకరణ

Jun 8 2026 10:11 AM | Updated on Jun 8 2026 10:11 AM

మహారాణిపేట: భారత ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు విశాఖ జిల్లాలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో పోలింగ్‌ కేంద్రాల పునర్వ్యవస్థీకరణకు సంబంధించిన ముసాయిదా జాబితాను ప్రచురించినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ ఎం.అభిషిక్త్‌ కిశోర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం జిల్లాలో 1,980 పోలింగ్‌ కేంద్రాలు ఉన్నాయని పేర్కొన్నారు. ప్రతి పోలింగ్‌ కేంద్రంలో గరిష్టంగా 1,200 మంది ఓటర్లు మాత్రమే ఉండేలా, అవసరమైన చోట కొత్త కేంద్రాల ఏర్పాటు, ప్రస్తుత కేంద్రాల వివరాల్లో మార్పులు, స్థాన మార్పులు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ ముసాయిదా జాబితాను రూపొందించినట్లు వెల్లడించారు. సదరు జాబితాలను అన్ని ఎలక్టోరల్‌, అసిస్టెంట్‌ ఎలక్టోరల్‌ రిజిస్ట్రేషన్‌ అధికారుల కార్యాలయాలతో పాటు జిల్లా కలెక్టరేట్‌లో ప్రజల పరిశీలనార్థం అందుబాటులో ఉంచామన్నారు. అలాగే గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు, ప్రస్తుత ఎమ్మెల్యేలు, ఎంపీలకు కూడా జాబితాల ప్రతులను అందజేసినట్లు చెప్పారు. ఈ ముసాయిదా జాబితాలపై ఏవైనా అభ్యంతరాలు, సూచనలు లేదా మార్పుల ప్రతిపాదనలు ఉంటే.. సంబంధిత ఎలక్టోరల్‌ రిజిస్ట్రేషన్‌ అధికారికి లేదా జిల్లా కలెక్టర్‌ కార్యాలయానికి ఈ నెల 15వ తేదీలోగా లిఖితపూర్వకంగా సమర్పించాలని సూచించారు. అందిన అభ్యంతరాలు, సూచనలను పరిశీలించి ఎన్నికల కమిషన్‌ నిబంధనల మేరకు తుది నిర్ణయం తీసుకోనున్నట్లు కలెక్టర్‌ స్పష్టం చేశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement