గోపాలపట్నం: డబుల్ ఇంజిన్ సర్కార్ విశాఖను అభివృద్ధి చేస్తామని చెప్పి, ఇప్పుడు నగర విమానాశ్రయాన్ని ప్రైవేట్ సంస్థలకు అప్పగించే ప్రయత్నం చేస్తోందని సీపీఎం జిల్లా కార్యదర్శి ఎం. జగ్గునాయుడు విమర్శించారు. విశాఖ విమానాశ్రయాన్ని దేశీయ విమానాశ్రయంగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ సీపీఎం నాయకులు ఆదివారం ఎయిర్‌పోర్టు జంక్షన్ జాతీయ రహదారిపై నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా జగ్గునాయుడు మాట్లాడుతూ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న విశాఖ విమానాశ్రయాన్ని మూసివేసి, భోగాపురం విమానాశ్రయానికి ప్రాధా న్యం కల్పించేలా జీఎంఆర్‌తో ఒప్పందాలు చేసుకోవడాన్ని ప్రశ్నించారు. ఈ అంశాన్ని ప్రజలకు తెలియకుండా గోప్యంగా ఉంచారని ఆరోపించారు. గత ఏడాది విశాఖ విమానాశ్రయం ద్వారా సుమారు 29 లక్షల మంది ప్రయాణించారని, అందులో 28 లక్షల మంది దేశీయ ప్రయాణికులేనని, కేవలం లక్ష మంది మాత్రమే అంతర్జాతీయ ప్రయాణాలు చేశారని తెలిపారు. భోగాపురం విమానాశ్రయాన్ని అంతర్జాతీయ సేవలకు ఉపయోగిస్తూ, విశాఖ విమానాశ్రయాన్ని డొమెస్టిక్ సేవలకు కొనసాగించాలని కోరారు. ప్రైవేట్ నిర్వహణలో విమానాశ్రయం ఉంటే ప్రయాణికులపై అదనపు భారం పడుతుందని పేర్కొన్నారు. ప్రస్తుతం యూజర్ చార్జీలు తక్కువగా ఉన్నప్పటికీ, భోగాపురం విమానాశ్రయంలో అవి గణనీయంగా పెరిగే అవకాశం ఉందన్నారు. పార్కింగ్ తదితర సేవల చార్జీలు కూడా పెరిగి ప్రయాణికులకు ఇబ్బందులు కలిగిస్తాయని చెప్పారు. జీఎంఆర్‌కు ప్రభుత్వం ప్రత్యేక ప్రయోజనాలు కల్పించిందని, భూములు, నిధులు, ఇతర సౌకర్యాలు అందించిందని ఆరోపించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా ప్రయోజనాలను పక్కనపెట్టి ప్రైవేట్ సంస్థలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. విశాఖ విమానాశ్రయాన్ని తరలించే ప్రయత్నాలు కొనసాగితే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సీపీఎం నాయకులు కె.ఎం. శ్రీనివాసరావు, బలివాడ వెంకటరావు, బి. పద్మ, వి. ప్రభావతి, జె. అయోధ్యారాం, పైడిరాజు, రాంబాబు పాల్గొన్నారు.


