ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల సంఖ్య పెంచాలి | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల సంఖ్య పెంచాలి

Jun 8 2026 10:11 AM | Updated on Jun 8 2026 10:11 AM

సీతంపేట: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు అధికారులు, ఉపాధ్యాయులు సమన్వయంతో కృషి చేయాలని పాఠశాల విద్యాశాఖ రీజినల్‌ జాయింట్‌ డైరెక్టర్‌ బి. విజయ భాస్కర్‌ పిలుపునిచ్చారు. అక్కయ్యపాలెం ఎన్జీజీవోస్‌ కాలనీలోని జీవీఎంసీ హైస్కూల్‌లో నిర్వహిస్తున్న జిల్లా 1, 2 తరగతుల ఉపాధ్యాయుల ‘ఫౌండేషనల్‌ లిటరసీ అండ్‌ న్యూమరసీ’ శిక్షణా కార్యక్రమాన్ని ఆదివారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆర్‌జేడీ మాట్లాడుతూ రాష్ట్రంలో నిర్వహిస్తున్న ‘బడిపిలుస్తోంది కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లను పెంచేందుకు ఉపాధ్యాయులు విశేష కృషి చేస్తున్నారని కొనియాడారు. జిల్లాలో వేసవి సెలవుల్లో సైతం అధికారులు, ఉపాధ్యాయులు ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ బడుల ప్రాధాన్యతను వివరించడం వల్లే.. ప్రైవేటు పాఠశాలల నుంచి పెద్ద సంఖ్యలో విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరుతున్నారని పేర్కొన్నారు. మరోవైపు కొత్త విద్యాసంవత్సరానికి సంసిద్ధతగా ఎఫ్‌ఎల్‌ఎన్‌ శిక్షణకు హాజరవుతున్న ఉపాధ్యాయుల అంకితభావాన్ని ఆయన అభినందించారు. ఉపాధ్యాయులు ఇదే స్ఫూర్తితో పాఠశాలల్లో విద్యార్థుల అభ్యాసన సామర్థ్యాలపై ప్రత్యేక శ్రద్ధ వహించి, విద్యా ప్రమాణాలను మెరుగుపరచాలని సూచించారు. బడుల్లో నాణ్యమైన విద్యాబోధన ద్వారానే తల్లిదండ్రుల్లో, సమాజంలో ప్రభుత్వ పాఠశాలల పట్ల నమ్మకం, సానుకూల దృక్పథం పెరుగుతాయన్నారు. కార్యక్రమంలో ఏఎంవో జి. లక్ష్మి, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రాధాకుమారి, డైట్‌ అధ్యాపకులు, 9 మంది రిసోర్స్‌ పర్సన్లు, వివిధ పాఠశాలలకు చెందిన 100 మంది ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement