జీవీఎంసీ పరిధిలో గందరగోళంగా గృహ గణన
ఓ చోట నుంచి ఫోన్లలో వివరాల సేకరణ
33 ప్రశ్నలకు గణకులే జవాబులు రాశారన్న ఆరోపణలు
100 శాతం పూర్తయిందంటున్న అధికారులు
మహారాణిపేట: హలో.. నేను గృహ గణన సర్వే కోసం మాట్లాడుతున్నాను. మీ ఇంట్లో రామారావు గారు ఉన్నారా అండీ? కొంచెం వివరాలు కావాలి.
మరోకరికి ఫోన్: అమ్మో ఎండ మండిపోతోంది.. నేను మీ అపార్ట్‌మెంట్ కిందే ఉన్నాను, ఒక్కసారి కిందికి వస్తే ఆ వివరాలేంటో రాసుకుంటాను, మిగతావి నేనే పూర్తి చేసేస్తా...
ఇదీ ప్రస్తుతం జీవీఎంసీ పరిధిలో సాగుతున్న ’గృహ గణన’ అసలు రంగు. ప్రభుత్వ ఆశయం గొప్పదే కావచ్చు.. కానీ క్షేత్రస్థాయిలో దాన్ని అమలు చేయాల్సిన యంత్రాంగం మాత్రం గడువు ముగిసిపోతుందనే తొందరలో సర్వేను తూతూమంత్రంగా ముగించేసింది. భవిష్యత్తు పదేళ్ల ప్రణాళికను నిర్దేశించాల్సిన అత్యంత కీలకమైన ఈ సర్వే, నగరంలో కేవలం ఒక ఫోన్ కాల్ ప్రహసనంగా మారిపోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
గణాంకాల గారడీ.. కాగితాల్లోనే వంద శాతం
విశాఖ జిల్లా వ్యాప్తంగా మొత్తం 9,29,000 గృహాలు ఉండగా, ఈ భారీ ప్రక్రియ కోసం ప్రభుత్వం 7,639 మంది సిబ్బందిని రంగంలోకి దించింది. ఇందులో జీవీఎంసీ పరిధిలోని 98 వార్డుల్లోనే 4,248 మంది ఎన్యూమరేటర్లు, 702 మంది సూపర్‌వైజర్లు బాధ్యతలు చేపట్టారు. ఇందుకోసం నగరాన్ని 4,249 బ్లాక్‌లుగా విభజించారు. మే 1వ తేదీ నుంచి 30వ తేదీ లోపు ఈ సర్వే పూర్తి కావాల్సి ఉండగా, క్షేత్రస్థాయిలో నత్తనడకన సాగడంతో అధికారులు మరో 5 రోజులు అదనపు గడువు ఇచ్చారు. ఈనెల 5వ తేదీతో సర్వే గడువు ముగిసింది. అధికారులు అధికారికంగా 100 శాతం సర్వే పూర్తయిందని గుండెల మీద చేతులేసుకుని చెబుతున్నారు కానీ, నగరంలో మెజారిటీ ఇళ్లకు కనీసం ఒక్క గణకుడు కూడా అడుగుపెట్టలేదన్నదే పచ్చి నిజం.
ఎండల సాకు.. ‘సొంత’ సర్వే
ఒక్కో ఇంటికి వెళ్లి ప్రభుత్వం నిర్దేశించిన 33 ప్రశ్నలు అడిగి, యాప్‌లో నమోదు చేయాలంటే కనీసం 30 నిమిషాల సమయం పడుతుంది. అయితే, నగరంలో మండుతున్న తీవ్రమైన ఎండలను సాకుగా చూపుతూ గణకులు తేలిక మార్గాన్ని ఎంచుకున్నారు.
కూర్చున్న చోటు నుంచే కార్యకలాపాలు: అపార్ట్‌మెంట్ల కింద వాచ్‌మెన్ల దగ్గరో, సచివాలయాల్లోనో, లేదా చెట్ల కిందో కూర్చుని లీడర్ల ద్వారా నంబర్లు సేకరించి ఫోన్లలోనే కానిచ్చేస్తున్నారు.
ఇష్టారాజ్యంగా సమాధానాలు: కుటుంబ యజమాని పేరు కనుక్కుని, మిగిలిన తాగునీరు, మురుగు పారుదల, మరుగుదొడ్లు, గృహ నిర్మాణం వంటి మిగిలిన అత్యంత కీలకమైన ప్రశ్నలకు గణకులే తమకు నచ్చినట్లుగా టిక్కులు పెట్టేస్తున్నారు.
భయాందోళనలో ప్రజలు: ఒకవేళ నిజాయితీగా వివ రాలు చెబితే ఎక్కడ ఉన్న పథకాలు ఊడిపోతాయోన న్న భయంతో కొందరు ప్రజలు సమాచారాన్ని దాటవేస్తుంటే, మరికొందరికి అసలు ఆ 33 ప్రశ్నల కరపత్రం ముఖమే చూపించకుండా సర్వే క్లోజ్ చేస్తున్నారు.
పదేళ్ల భవిష్యత్తుపై ‘మొక్కుబడి’ దెబ్బ
ఈ సర్వే ద్వారా సేకరించే సమాచారం పూర్తిగా గోప్యంగా ఉంటుందని, దీనివల్ల సంక్షేమ పథకాలకు ఎలాంటి ఢోకా ఉండదని ప్రభుత్వం స్పష్టం చేసినప్పటికీ, క్షేత్రస్థాయిలో సిబ్బంది నిర్లక్ష్యం వల్ల తప్పుడు సమాచారం నమోదవుతోంది. ఈ సమాచారం ఆధారంగానే రాబోయే 10 ఏళ్ల నగర అభివృద్ధి ప్రణాళికలు, మౌలిక వసతుల కల్పన ఆధారపడి ఉంటాయి. ఇలాంటి శాసీ్త్రయత లేని, తప్పుల తడకల సర్వే వల్ల భవిష్యత్తులో ప్రజలకు అందాల్సిన వసతులు, ప్రభుత్వ పథకాలు అందకుండా పోయే ప్రమాదం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు నిద్ర మత్తు వదిలి, జీవీఎంసీ పరిధిలో జరిగిన ఈ మొక్కుబడి సర్వేపై క్షేత్రస్థాయిలో రీ–వెరిఫికేషన్ చేపట్టి తగిన చర్యలు తీసుకోవాలని నగరవాసులు డిమాండ్ చేస్తున్నారు.
మా ఇంటికి ఎవరూ రాలేదు
నేను లలితానగర్‌లోని శ్యామలమ్మ ఆలయం సమీపంలో కుటుంబంతో నివసిస్తున్నాను. మా ఇంటికి సర్వే కోసం ఎవరూ రాలేదు. ఎక్కడి నుంచో ఫోన్ చేసి వివరాలు అడిగారు. ఫోన్ సిగ్నల్ కూడా సరిగ్గా లేదు. నా భర్త పేరు, నా పేరు, కుటుంబ సభ్యుల సంఖ్య మాత్రమే అడిగి, సర్వే అయిపోయిందన్నారు. అసలు 33 ప్రశ్నలు ఉంటాయని మాకు తెలియదు. ఇంకా ఏమైనా అడుగుతారేమో, పథకాలు కట్ అవుతాయేమో అని భయపడ్డాను. – ఎ.రేష్మి, లలితానగర్


