విచారణాధికారి నియామకంపై అభ్యంతరం వ్యక్తం చేసిన ప్రధాన ఫిర్యాదుదారు
ఏయూలో బ్యాక్ లాగ్ పోస్టుల నియామకాల వ్యవహారం
సిట్టింగ్ జడ్జితో విచారణకు డి మాండ్
విశాఖ విద్య: ఏయూలో ఎస్సీ, ఎస్టీ నాన్ టీచింగ్ బ్యాక్‌లాగ్ పోస్టుల నియామకాలపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో శనివారం ప్రారంభమైన విచారణకు బ్రేక్ పడింది. ఏయూ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ హాల్లో విచారణాధికారి, రిటైర్డ్ జడ్జి బమ్మిడి శ్రీనివాసరావు విచారణను ప్రారంభించారు. ఇందులో భాగంగా ప్రధాన ఫిర్యాదుదారు, విదసం నేత బూసి వెంకటరావుతో ప్రమాణం చేయించిన అనంతరం ఆయన స్టేట్‌మెంట్ రికార్డ్ చేయాలని భావించారు. ఈ సందర్భంగా బూసి వెంకటరావు విచారణాధికారి వద్ద తన అభ్యంతరాలను వ్యక్తం చేశారు. బ్యాక్‌లాగ్ పోస్టుల నియామకాల అవకతవకలపై విచారణాధికారిగా ఒక సిట్టింగ్ జడ్జిని నియమించాలని తాము ఇప్పటికే కలెక్టర్‌ను కోరామని తెలిపారు. అలా కాకుండా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏయూ ఉన్నతాధికారులే స్వయంగా విచారణాధికారిని నియమించుకోవడం సహజ న్యాయ సూత్రాలకు పూర్తిగా విరుద్ధమన్నారు. అనంతరం తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని విచారణాధికారికి అందజేసినట్లు వెంకటరావు వెల్లడించారు. ఈ నియామక అవకతవకలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపిస్తేనే అర్హులకు పూర్తి న్యాయం జరుగుతుందని విదసం నేత వెంకటరావు పేర్కొన్నారు. ప్రస్తుత విచారణ అధికారిపై తమకు గౌరవం ఉందని, అయితే ఆయనను నియమించిన తీరుపైనే తమకు నమ్మకం లేదన్నారు. పోస్టుల భర్తీలో అవకతవకల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏయూ వీసీ, రిజిస్ట్రార్లే విచారణాధికారిని నియమిస్తే బాధితులకు న్యాయం ఎలా జరుగుతుందని ఆయన ప్రశ్నించారు. సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపిస్తేనే అర్హులైన ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు న్యాయం జరుగుతుందన్నారు.


