ఏపీఎల్‌ రన్‌ రణరంగం | - | Sakshi
Sakshi News home page

ఏపీఎల్‌ రన్‌ రణరంగం

Jun 7 2026 12:21 AM | Updated on Jun 7 2026 12:21 AM

● మరో రెండు రోజుల్లో వైఎస్సార్‌ స్టేడియంలో ధమాకా ● ఈసారి మూడు వేదికల్లో ఏపీఎల్‌ లీగ్‌

విశాఖ స్పోర్ట్స్‌: క్రికెట్‌ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఆంధ్ర ప్రీమియర్‌ లీగ్‌ (ఏపీఎల్‌) ఐదో సీజన్‌కు తెరలేవనుంది. కప్‌ను కై వసం చేసుకునేందుకు ఏడు జట్లు సిద్ధమవగా..మంగళవారం రాత్రి వైఎస్సార్‌ స్టేడియం ఫ్లడ్‌లైట్ల వెలుతురులో తొలి మ్యాచ్‌ ప్రారంభం కానుంది. ఈసారి తొలిసారిగా ఏపీఎల్‌ మ్యాచ్‌లను మూడు వేదికల్లో నిర్వహించేందుకు నిర్వాహక కమిటీ ఏర్పాట్లు చేసింది.

మూడు వేదికల్లో మ్యాచ్‌లు

లీగ్‌ దశలో మొదటి ఫేజ్‌ మ్యాచ్‌లు విశాఖ వేదికగా ఈ నెల 14వ తేదీ వరకు జరగనున్నాయి. ఇక్కడ మొత్తం 11 మ్యాచ్‌లు నిర్వహిస్తారు. ఆ తర్వాత తొలిసారిగా కడప స్టేడియంలో 9 మ్యాచ్‌లు, మంగళగిరి స్టేడియంలో 8 మ్యాచ్‌లు జరగనున్నాయి. మంగళగిరి వేదికగా నాకౌట్‌ పోటీలు నిర్వహించి, జూన్‌ 30న ఈ సీజన్‌కు ముగింపు పలకనున్నారు.

రెండో టైటిల్‌ ఎవరిదో?

ఏపీఎల్‌లో ఇప్పటివరకు జరిగిన నాలుగు సీజన్లలోనూ ప్రతిసారీ కొత్త జట్టు విజేత నిలిచింది. కోస్టల్‌ రైడర్స్‌ మాత్రమే రెండుసార్లు ఫైనల్‌కు చేరి, 2022లో విజేతగా నిలిచింది. 2023లో రాయలసీమ కింగ్స్‌, 2024లో వైజాగ్‌ వారియర్స్‌ చాంపియన్లగా నిలవగా.. ప్రస్తుతం తుంగభద్ర వారియర్స్‌ డిఫెండింగ్‌ చాంపియన్‌గా బరిలోకి దిగుతోంది. గత సీజన్‌లో వైజాగ్‌ వారియర్స్‌ను విజేతగా నిలిపిన స్థానిక స్టార్‌ క్రికెటర్‌ కేఎస్‌ భరత్‌ టెస్ట్‌ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించడమే కాకుండా, ఈ సీజన్‌ ఏపీఎల్‌కు దూరం కావడం గమనార్హం.

రూ.16.25 లక్షలతో శశికాంత్‌ టాప్‌: గత సీజన్లలో అశ్విన్‌ హెబ్బర్‌, హనుమ విహారి, నితీష్‌ కుమార్‌ రెడ్డి, అవినాష్‌లు అత్యధిక ధరకు అమ్ముడుపోగా.. ప్రస్తుత సీజన్‌లో స్థానిక ఆటగాడు కేవీ శశికాంత్‌ను రూ.16.25 లక్షల భారీ మొత్తానికి డిఫెండింగ్‌ చాంపియన్‌ తుంగభద్ర వారియర్స్‌ దక్కించుకుంది. గత సీజన్లలో గిరినాథ్‌, హేమంత్‌, అశ్విన్‌, హనుమ విహారి ‘మోస్ట్‌ వేల్యుబుల్‌ ప్లేయర్స్‌’గా నిలిచారు.

గత సీజన్‌ రికార్డులు

గత సీజన్‌లో అభినవ్‌ 269 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. హనుమ విహారి, అశ్విన్‌ హెబ్బర్‌, మహీప్‌ కుమార్‌, రషీద్‌ (ప్రస్తుతం శ్రీలంక పర్యటనలో ఉన్నందున అందుబాటులో లేడు) తర్వాత స్థానాల్లో నిలిచారు. సిక్సర్ల విషయానికొస్తే అశ్విన్‌ అత్యధికంగా 25 సిక్సర్లు, రోహిత్‌ 20 సిక్సర్లు బాదారు. బౌలింగ్‌లో సత్యనారాయణ, శశికాంత్‌లు చెరో 14 వికెట్లతో రాణించారు. ఈసారి వైజాగ్‌ వారియర్స్‌, రాయలసీమ కింగ్స్‌, ఉత్తరాంధ్ర లయన్స్‌, బెజవాడ టైగర్స్‌ వంటి 7 ఫ్రాంచైజీల మధ్య జరగబోయే ఈ పోరులో ఎవరు అత్యధిక పరుగులు, వికెట్లు సాధిస్తారో చూడాలి.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement