రోబోటిక్‌ సర్జరీతో మెరుగైన క్యాన్సర్‌ వైద్యం | - | Sakshi
Sakshi News home page

రోబోటిక్‌ సర్జరీతో మెరుగైన క్యాన్సర్‌ వైద్యం

Jun 7 2026 12:21 AM | Updated on Jun 7 2026 12:21 AM

ఎన్టీపీసీ సింహాద్రి హెడ్‌ అయస్కాంత్‌ జెనా

అగనంపూడి: అగనంపూడిలోని హోమీబాబా క్యాన్సర్‌ ఆస్పత్రి, పరిశోధనా సంస్థ 12వ వ్యవస్థాపక దినోత్సవాన్ని శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్టీపీసీ హెడ్‌ అయస్కాంత జెనా మాట్లాడుతూ సామాజిక బాధ్యత కార్యక్రమాల్లో భాగంగా క్యాన్సర్‌ రోగులకు మెరుగైన వైద్యం అందించేందుకు ఎన్టీపీసీ సహకరిస్తుందని తెలిపారు. ఆస్పత్రితో రోబోటిక్‌ సర్జరీ యూనిట్‌, 3 మెగావాట్ల సోలార్‌ విద్యుత్‌ ప్లాంట్‌ ఏర్పాటు కోసం ఒప్పందాలు చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఆస్పత్రి డైరెక్టర్‌ డా. ఉమేష్‌ మహంతశెట్టి మాట్లాడుతూ 12 ఏళ్లలో క్యాన్సర్‌ సంరక్షణలో సంస్థ విశేష పురోగతి సాధించిందన్నారు. ఆధునిక వైద్య సాంకేతికత, డయాగ్నస్టిక్‌ సదుపాయాలతో సమగ్ర చికిత్స అందిస్తున్నామని తెలిపారు. చికిత్సతో పాటు పునరావాసం, మానసిక మద్దతు కూడా సమగ్ర క్యాన్సర్‌ సంరక్షణలో భాగమని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా ‘ప్రేరణ’ పేరుతో క్యాన్సర్‌ బాధితులు, రోగం నుంచి కోలుకున్న వారు, వైద్యులు, సహాయకులతో ఒక ప్రత్యేక గ్రూప్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇది రోగుల్లో మానసిక ధైర్యం పెంపొందించేందుకు నెలవారీ సమావేశాలు నిర్వహిస్తుందని వివరించారు. అలాగే నాల్గవ వార్షిక క్యాన్సర్‌ కాంగ్రెస్‌ కూడా నిర్వహించారు. ఇందులో అంతర్జాతీయ క్యాన్సర్‌ నిపుణులు డాక్టర్‌ శైలేష్‌ వి శ్రీఖండో, వైస్‌ అడ్మిరల్‌ ఆర్తి సారిన్‌ పాల్గొని ఆధునిక క్యాన్సర్‌ చికిత్స విధానాలు, రోబోటిక్‌ సర్జరీ, రేడియోథెరపీ వంటి అంశాలపై చర్చించారు. ఈ సదస్సుకు తెలుగు రాష్ట్రాలతో పాటు ఒడిశా, పశ్చిమ బెంగాల్‌ నుంచి సుమారు 150 మంది వైద్య నిపుణులు, పీజీ విద్యార్థులు, సీనియర్‌ రెసిడెంట్లు హాజరయ్యారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement