పరవాడ: జేఎన్ ఫార్మాసిటీలోని ‘శోధన’ పరిశ్రమలో పనిచేస్తున్న బిహార్ రాష్ట్రానికి చెందిన కార్మికుడు రామ్‌బాలిరాయ్ (50) అస్వస్థతకు గురై శుక్రవారం రాత్రి మృతి చెందాడు. పోలీసుల వివరాల ప్రకారం.. మూడు రోజుల క్రితమే విధుల్లో చేరిన ఆయన.. శుక్రవారం సాయంత్రం షిఫ్ట్ ముగించుకుని ఇంటికి వెళ్లే క్రమంలో పరిశ్రమ క్యాంటిన్ వద్ద ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. తోటి కార్మికులు వెంటనే పరవాడలోని ప్రైవేటు ఆసుపత్రికి, ఆపై మెరుగైన చికిత్స కోసం కేజీహెచ్‌కు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఆయన అనారోగ్యంతోనే మృతి చెందినట్లు యాజమాన్యం చెబుతోంది. కాగా ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధితుడి కుటుంబానికి న్యాయం చేయాలని ఫార్మాసిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షుడు గనిశెట్టి సత్యనారాయణ డిమాండ్ చేశారు. మృతికి గల కారణాలు పోస్టుమార్టంలో తేలనున్నాయని, ప్రస్తుతానికి అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ ఆర్.మల్లికార్జునరావు తెలిపారు.


