ఆరిలోవ: విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు వల్ల పర్యావరణానికి తీవ్ర ముప్పు వాటిల్లుతుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి జేవీ సత్యనారాయణ మూర్తి ఆందోళన వ్యక్తం చేశారు. ముడసర్లోవ వద్ద సింహాచలం దేవస్థానానికి చెందిన 160 ఎకరాల కొండ భూములను చంద్రబాబు ప్రభుత్వం గూగుల్ డేటా సెంటర్‌కు కేటాయించడాన్ని వ్యతిరేకిస్తూ శుక్రవారం సీపీఐ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా బీఆర్‌టీఎస్ రోడ్డులోని రామకృష్ణాపురం కూడలి నుంచి డేటా సెంటర్ గేటు వరకు ఎర్రజెండాలతో భారీ ర్యాలీ నిర్వహించి, అక్కడ ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సత్యనారాయణ మూర్తి మాట్లాడుతూ.. పర్యావరణాన్ని కాపాడాల్సిన ప్రభుత్వమే దాన్ని నాశనం చేయడం దారుణమన్నారు. డేటా సెంటర్ల వల్ల వాతావరణం వేడెక్కి జీవరాశుల మనుగడకే ముప్పు వస్తుందని హెచ్చరించారు. అమెరికా, యూరప్ దేశాల్లో వీటి వల్ల జరిగే నష్టాలపై పర్యావరణ శాస్త్రవేత్తలు ఐక్యరాజ్యసమితికి నివేదికలు ఇచ్చారని, అందుకే అక్కడ వీటిని వ్యతిరేకిస్తున్నారని తెలిపారు. అలాంటి ప్రమాదకరమైన సంస్థలను అమరావతిలో కాకుండా, ఉత్తరాంధ్రలో ఏర్పాటు చేసి ఇక్కడి ప్రజల ఆరోగ్యంతో చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ చలగాటమాడుతున్నారని ఆరోపించారు. గతంలో సింహాద్రి అప్పన్న కొండ మధ్యలో సొరంగ మార్గం ఏర్పాటును అడ్డుకున్న ఆగమ శాస్త్రవేత్తలు ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారని ఆయన ప్రశ్నించారు. పర్యావరణ పరిరక్షణ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ దీనిపై నోరు విప్పకుండా, ఇతర మంత్రులపై విమర్శలు చేయడం సరికాదన్నారు. రాష్ట్రంలో వాయు కాలుష్యం పెరిగిపోయిందని ప్రభుత్వ సంస్థలే చెబుతున్నాయని, ఈ తరుణంలో చెట్లను పెంచాల్సింది పోయి, ఉన్న అడవులను నాశనం చేస్తున్నారని మండిపడ్డారు. తక్షణమే డేటా సెంటర్‌కు ఇచ్చిన అనుమతులను రద్దు చేయాలని, లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో సీపీఐ నాయకులు విమల, పైడిరాజు, రెహమాన్, నాగభూషణరావు, నాగరాజు, బీబీ, పుష్పలత, లక్ష్మణరావు, గోవింద్, శ్రీనివాసరావు, అప్పలరాజు పాల్గొన్నారు.


