● వలస నేతల స్వార్థ రాజకీయాలకు విశాఖను బలి చేస్తే సహించం ● మహానగరాన్ని ఓల్డ్‌సిటీగా చేసే హక్కు మీకు లేదు ● ఎంపీ భరత్, విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌నాయుడుపై వైఎస్సార్‌సీపీ దక్షిణ సమన్వయకర్త వాసుపల్లి ఫైర్
డాబాగార్డెన్స్: విశాఖ నడిబొడ్డున ఉన్న ప్రస్తుత విమానాశ్రయాన్ని ఇక్కడే యథావిధిగా కొనసాగించాలని, అలాగే ప్రశాంతమైన వైజాగ్ బీచ్ రోడ్డులో మద్యం దుకాణాల ఏర్పాటు నిర్ణయాన్ని కూటమి ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త వాసుపల్లి గణేష్‌కుమార్ డిమాండ్ చేశారు. ఆశీల్‌మెట్టలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వలస నాయకుల స్వార్థ రాజకీయాల వల్ల విశాఖ రిచ్ సిటీగా మారిపోతోందని ఆరోపించారు. జమ్మూ కాశ్మీర్, గోవా, శ్రీనగర్, చండీఘర్, ఆగ్రా వంటి అనేక ప్రాంతాల్లో రక్షణ శాఖ అనుసంధానంతోనే విమానాశ్రయాలు విజయవంతంగా నడుస్తున్నప్పుడు, విశాఖకు వచ్చిన ఇబ్బంది ఏంటని ధ్వజమెత్తారు. ఈ విషయంలో ఎంపీ భరత్, కేంద్ర విమానాయానశాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు చేస్తున్న వ్యాఖ్యలు సరికాదన్నారు. భోగాపురం ఎయిర్‌పోర్టు రావడం వల్ల విజయనగరం జిల్లా అభివృద్ధి చెందడాన్ని తాము స్వాగతిస్తున్నామని, కానీ ఆ పేరుతో విశాఖ గొంతు కోయడం సమంజసం కాదన్నారు. విశాఖ నుంచి భోగాపురం 56 కిలోమీటర్ల దూరంలో ఉంటుందని ప్రయాణికులు విమానం ఎక్కడానికి నాలుగు గంటల పైగా సమయం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. విశాఖ హెల్త్ సిటీగా అభివృద్ధి చెందుతున్న తరుణంలో ఆర్గన్ ట్రాన్స్‌ప్లాంటేషన్ సేవలు వేగంగా విస్తరిస్తున్నాయన్నారు. 56 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎయిర్‌పోర్టును దూరం చేస్తే, గుండె గానీ, లివర్ గానీ లేదా ఇతర ఆర్గాన్‌లను నిర్దిష్ట సమయానికి ఎలా తీసుకువస్తారని ప్రశ్నించారు.
బీచ్‌లో మద్యం విక్రయాల
నిర్ణయంపై ఆగ్రహం
విశాఖ బీచ్‌ను బార్ ప్రాంతంగా మార్చాలని చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై వాసుపల్లి గణేష్‌కుమార్ నిప్పులు చెరిగారు. పర్యాటకులను ఆకర్షించే పేరిట బీచ్‌లో షాక్స్ ఏర్పాటు చేసి మద్యం విక్రయాలకు అనుమతులు ఇవ్వడం అత్యంత ప్రమాదకరమన్నారు. గతంలోనూ విశాఖ బీచ్‌ను గోవాగా మార్చి రెడ్‌లైట్ ఏరియాగా చేసే ప్రయత్నం చేస్తే ప్రజలు చంద్రబాబుకు తగిన గుణపాఠం చెప్పారని గుర్తుచేశారు. ఈ సమావేశంలో వైఎస్సార్ సీపీ నాయకులు కోడిగుడ్ల పూర్ణిమ, శ్రీధర్, డేవిడ్‌రాజు, అబ్బిరెడ్డి ఆదివిష్ణు, సనపల రవీంద్రభరత్, దసమంతుల చిన్ని, వాసుపల్లి బంగారమ్మ, రాము తదితరులు పాల్గొన్నారు.


