వెన్నుపోటు బాబూ..
చంద్రబాబు అబద్ధపు పాలనపై విశాఖ వ్యాప్తంగా మిన్నంటిన నిరసన జ్వాలలు ’టీడీపీ మేనిఫెస్టో’ ప్రతులను అడుగడుగునా తగలబెట్టిన శ్రేణులు వైఎస్సార్‌సీపీ శ్రేణుల భారీ ర్యాలీలు, మానవహారాలతో హోరెత్తిన వీధులు
సాక్షి, విశాఖపట్నం : మోసాన్నే పెట్టుబడిగా, అబద్ధాలనే ఆయుధంగా
మలచుకుని అధికార పీఠమెక్కిన చంద్రబాబు నయవంచనపై విశాఖ
ఉగ్రరూపం దాల్చింది. ‘వెన్నుపోటు బాబూ.. ఆపు నీ డాబు! ఇంకా
ఎన్నాళ్లు ప్రజల్ని మోసం చేసి అధికారాన్ని అనుభవిస్తావ్?’ అంటూ జిల్లా వ్యాప్తంగా
నిరసన జ్వాలలు ఎగిసిపడ్డాయి. చంద్రబాబు మార్క్ ‘వెన్నుపోటు రాజకీయాలకు’ రెండేళ్లు
పూర్తయిన సందర్భంగా వైఎస్సార్‌సీపీ పిలుపుమేరకు ప్రజలు, పార్టీ శ్రేణులు భారీ ఎత్తున
కదం తొక్కారు. అధికారంలోకి రావడానికి ప్రజల చెవుల్లో పెట్టిన బూటకపు హామీల చిట్టా
‘టీడీపీ మేనిఫెస్టో’ ప్రతులను అడుగడుగునా దహనం చేస్తూ చంద్రబాబు మోసపూరిత వైఖరిపై
నిప్పులు చెరిగారు. భారీ ర్యాలీలు, మానవహారాలతో విశాఖ జిల్లా చంద్రబాబు అబద్ధపు
పాలనకు వ్యతిరేకంగా ముక్తకంఠంతో గర్జించింది.
భీమిలిలో..
తగరపువలస అంబేడ్కర్ కూడలి వద్ద, మధురవాడ జోన్‌లో పీఎం పాలెం క్రికెట్ స్టేడియం వద్ద నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. భీమిలి సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు, పరిశీలకుడు తైనాల విజయకుమార్ సహా వందలాది మంది నాయకులు కార్యకర్తలు రోడ్డెక్కి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం టీడీపీ ఎన్నికల మేనిఫెస్టో ప్రతులు దహనం చేస్తూ.. చంద్రబాబు రెండేళ్ల పాలనలో వైఫల్యాను ఎండగట్టారు.
గాజువాకలో..
నియోజకవర్గ సమన్వయకర్త తిప్పల శ్రీనివాస దేవన్ రెడ్డి బీహెచ్‌పీవీ జంక్షన్, కూర్మన్నపాలెం జంక్షన్, పెదగంట్యాడ జంక్షన్‌లో టీడీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. మాజీ ఎమ్మెల్యే, పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సభ్యుడు తిప్పల నాగిరెడ్డి, పార్టీ నియోజకవర్గ పరిశీలకుడు, మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు నేతృత్వంలో కూర్మన్నపాలెం జంక్షన్‌లో పార్టీ శ్రేణులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.


