గోపాలపట్నం: స్థానిక ప్రధాన రహదారిలోని రామాలయం సమీపంలో ఉన్న ’హైదరాబాద్ పెరల్స్ అండ్ జ్యువెలర్స్’ దుకాణంలో గురువారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. దుకాణంలోని ఏసీ వద్ద అకస్మాత్తుగా మంటలు చెలరేగినట్లు యజమాని బి.హేమ తెలిపారు. ప్రమాదాన్ని గమనించిన వెంటనే విద్యుత్ సరఫరా నిలిపివేసినప్పటికీ, అప్పటికే మంటలు దుకాణమంతటా వేగంగా వ్యాపించాయి. అయితే, లోపల ఉన్న సిబ్బంది, వినియోగదారులు అప్రమత్తమై వెంటనే బయటకు రావడంతో ప్రాణనష్టం తప్పింది. సమాచారం అందుకున్న పోలీసులు ట్రాఫిక్‌ను నియంత్రించగా, మర్రిపాలెం అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని గంటలపాటు శ్రమించి మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో దుకాణంలో ఉన్న వన్‌గ్రామ్ గోల్డ్ నగలు, ఇతర విలువైన వస్తువులు, నగదు పూర్తిగా కాలి బూడిదయ్యాయని, సుమారు రూ. 50 లక్షల మేర నష్టం వాటిల్లినట్లు బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, ప్రమాద స్థలాన్ని సందర్శించిన ఎమ్మెల్యే పి.గణబాబు బాధితులను పరామర్శించి, ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటనపై పారదర్శకంగా దర్యాప్తు జరపాలని ఆయన అధికారులను ఆదేశించారు.


