అల్లిపురం: ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా ఎలాంటి అవరోధాలు తలెత్తకుండా అన్ని శాఖలతో సమన్వయం చేసుకుంటూ బందోబస్తు విధులు నిర్వహించాలని నగర పోలీసు కమిషనర్ డా. శంఖబ్రత బాగ్చి అధికారులను ఆదేశించారు. నగర పోలీసు కమిషనరేట్ సమావేశ మందిరంలో డీసీపీ–1, డీసీపీ–2, డీసీపీ క్రైమ్స్, ట్రాఫిక్ అధికారులు, ఏడీసీపీలు, ఏసీపీలు, సంబంధిత సీఐలతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన భద్రతా ఏర్పాట్లపై పలు సూచనలు చేశారు. ముఖ్యమంత్రి, గవర్నర్, మంత్రులు, ఇతర ప్రముఖులు పర్యటించే ప్రాంతాల్లో విధులు నిర్వహించే సిబ్బందికి తాగునీరు, మజ్జిగ, భోజనం సమయానికి అందేలా చూడాలని ఆదేశించారు. ఎండ తీవ్రత దృష్ట్యా వడదెబ్బ నివారణ కోసం వోఆర్‌ఎస్ ప్యాకెట్లు, మజ్జిగ, అంబులెన్సులను అందుబాటులో ఉంచాలని సూచించారు. అలాగే ప్రతి శుక్రవారం నిర్వహించే ‘నో వెహికల్ డే’లో భాగంగా ముఖ్యమంత్రి ఏయూ హెలిప్యాడ్ నుంచి నోవాటెల్ వరకు సైకిల్‌పై ప్రయాణించనున్న నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా పోలీసు కమిషనర్ డా. శంఖబ్రత బాగ్చి, డీసీపీ–1తో కలిసి ఏయూ హెలిప్యాడ్ నుంచి నోవాటెల్ వరకు సైకిల్‌పై వెళ్లి భద్రతా చర్యలను సమీక్షించారు.


