తాటిచెట్లపాలెం: వేసవి సీజన్‌లో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రస్తుతం నడుస్తున్న పలు వీక్లీ స్పెషల్ రైళ్ల సేవలను మరికొంత కాలం పొడిగించినట్లు సౌత్ కోస్ట్ రైల్వే విశాఖ డివిజన్ చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ వై. బాలాజీ కిరణ్ తెలిపారు. సికింద్రాబాద్–నహర్‌లగున్ మధ్య నడిచే 07046 వీక్లీ స్పెషల్ ఎక్స్‌ప్రెస్‌ను సెప్టెంబర్ 25 వరకు, తిరుగు ప్రయాణంలోని 07047 నహర్‌లగున్– సికింద్రాబాద్ వీక్లీ స్పెషల్‌ను సెప్టెంబర్ 28 వరకు పొడిగించారు. ఈ రైలు ప్రతి శుక్రవారం సికింద్రాబాద్‌లో బయల్దేరి దువ్వాడ మీదుగా నహర్‌లగున్ చేరుకోగా, తిరుగు ప్రయాణంలో ప్రతి సోమవారం నహర్‌లగున్ నుంచి బయల్దేరి గురువారం సికింద్రాబాద్ చేరుకుంటుంది. అదేవిధంగా చర్లపల్లి–సంత్రగచ్చి మధ్య నడిచే 07221 వీక్లీ స్పెషల్ రైలును సెప్టెంబర్ 26 వరకు, తిరుగు ప్రయాణంలోని 07222 సంత్రగచ్చి–చర్లపల్లి వీక్లీ స్పెషల్‌ను సెప్టెంబర్ 27 వరకు కొనసాగించనున్నారు. ఈ రైళ్లు దువ్వాడ మీదుగా రాకపోకలు సాగిస్తాయి. ఇక గౌహతి–బెంగళూరు మధ్య ప్రత్యేక సమ్మర్ స్పెషల్ రైళ్లు కూడా నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. 05642 గౌహతి–బెంగళూరు సమ్మర్ స్పెషల్ జూన్ 6న గౌహతి నుంచి బయల్దేరి జూన్ 8న బెంగళూరు చేరుకోనుండగా, 05641 బెంగళూరు–గౌహతి సమ్మర్ స్పెషల్ జూన్ 9న బెంగళూరు నుంచి బయల్దేరి జూన్ 11న గౌహతి చేరుకుంటుంది. ప్రయాణికులు ఈ ప్రత్యేక రైళ్లను వినియోగించుకోవాలని రైల్వే అధికారులు సూచించారు.


