మహారాణిపేట: కేజీహెచ్‌లో వైద్యులు అరుదైన శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు. విజయనగరం జిల్లాకు చెందిన టి.రజని గత ఏడాది కాలంగా తీవ్ర కడుపునొప్పితో బాధపడుతూ గత నెల 14న కేజీహెచ్ యూరాలజీ విభాగంలో చేరారు. పరీక్షల అనంతరం ఆమె కడుపులోని అడ్రినల్ గ్రంథిలో కుడివైపు 6 సెం.మీ, ఎడమవైపు 28 సెం.మీ మేర కణితి ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. లక్ష మందిలో నలుగురికి మాత్రమే వచ్చే ‘బైలాటరల్ అడ్రినల్ మైలోలిపోమా విత్ కంజెనిటల్ అడ్రినల్ హైపర్‌ప్లాసియా’ అనే అరుదైన వ్యాధిగా దీనిని నిర్ధారించారు. యూరాలజీ విభాగాధిపతి డాక్టర్ చంద్రశేఖర్ పర్యవేక్షణలో, ఎండోక్రినాలజీ, అనస్తీషియా విభాగాల సహకారంతో గత నెల 19న రజనికి శస్త్రచికిత్స చేసి కడుపులో ఉన్న 4.5 కిలోల భారీ కణితను విజయవంతంగా తొలగించారు. ప్రస్తుతం రోగి ఆరోగ్యం నిలకడగా ఉండటంతో గురువారం డిశ్చార్జ్ చేసినట్లు కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఐ.వాణి తెలిపారు. విజయవంతంగా శస్త్రచికిత్స చేసిన డాక్టర్ చంద్రశేఖర్, అనస్తీషియా వైద్యులు కె.శ్రీలక్ష్మి, శరత్ చంద్ర, అప్పలరాజు, వెంకటకృష్ణ, దత్తాత్రేయ బృందాన్ని సూపరింటిండెంట్ అభినందించారు.


