చేసేవన్నీ మోసాలు | - | Sakshi
Sakshi News home page

చేసేవన్నీ మోసాలు

Jun 4 2026 7:09 AM | Updated on Jun 4 2026 7:09 AM

చెప్పేవన్నీ అబద్ధాలు

తూతూమంత్రంగా 4 పథకాలు అమలుచేసి చేతులు దులిపేసుకున్న చంద్రబాబు

పడకేసిన విద్య, వైద్యం, సంక్షేమ రంగాలు

ఫీజు రీయింబర్స్‌మెంట్‌, నిరుద్యోగ భృతి చెల్లించకుండా దగా

ఫ్రీబస్‌ తప్ప మహిళలకు ఒరిగింది శూన్యమే!

బాబు దగా పాలనపై ‘వెన్నుపోటుకు రెండేళ్లు’ పేరిట వైఎస్సార్‌సీపీ నిరసన బాట

సాక్షి, విశాఖపట్నం: అబద్ధాలనే పునాదిగా చేసుకుని.. మోసాలనే పూతగా పూసి.. నయవంచనకు మరో పేరుగా నిలిచింది చంద్రబాబు ప్రభుత్వం. ‘సూపర్‌–6’అంటూ ఊదరగొట్టి.. అధికార పీఠమెక్కిన కూటమి ప్రభుత్వంలో.. చంద్రబాబు తనకు అలవాటైన వెన్నుపోటు రాజకీయం ఈసారి ప్రజలపై ప్రదర్శించారు. ఈ 730 రోజుల్లో పలికిన ప్రతి మాటా ఓ అబద్ధం.. వేసిన ప్రతి అడుగూ ఓ ద్రోహం..! పేద, మధ్యతరగతి, యువత, మహిళలు, విద్యార్థులు, వృద్ధులు.. ఇలా ఏ ఒక్క వర్గాన్నీ వదలకుండా అందరి జీవితాలపైనా బాబు మార్కు వెన్నుపోటు వాతలు పడ్డాయి. అడుగడుగునా సాగుతున్న ఈ దగాకోరు పాలనపై.. ప్రజాగ్రహం కట్టలు తెంచుకుంటోంది. ఈ నయా వంచకుల ‘మోసాల సిక్సర్‌’తోపాటు, అసలు రంగును బట్టబయలు చేస్తూ.. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ.. ‘వెన్నుపోటుకు రెండేళ్లు’ పేరుతో మహా సంగ్రామానికి దిగింది. ప్రజల పక్షాన నిలబడి బాబు మోసాల చిట్టాను రచ్చబండకెక్కించి నిలదీస్తోంది..!

యువతకు నిరుద్యోగ దగా

నిరుద్యోగ యువతకు నెలకు రూ.3 వేలు నిరుద్యోగ భృతి ఇస్తామన్న హామీ బుట్టదాఖలైంది. ప్రభుత్వ లెక్కల ప్రకారమే ఉమ్మడి విశాఖ జిల్లా వ్యాప్తంగా నిరుద్యోగ యువత 2.05 లక్షల మంది ఉన్నారు. వీరికి 24 నెలల్లో ఒక్కొక్కరికీ రూ.72 వేలు చొప్పున ఇవ్వాల్సి ఉండగా.. కేవలం ఒక్క విశాఖ జిల్లా యువతకే సుమారు రూ.1,476 కోట్ల మేర చంద్రబాబు ఎగనామం పెట్టారు.

‘తల్లికి వందనం’లో కండిషన్ల వాత

ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఏడాదికి రూ.15 వేలు ఇస్తామన్నారు. అధికారంలోకి వచ్చాక తొలి ఏడాది పూర్తిగా ఎగ్గొట్టారు. రెండో ఏడాది రేషన్‌ కార్డులు, వయసు నిబంధనలు, హాజరు శాతం పేరిట కఠిన షరతులు విధించి, లబ్ధిదారుల సంఖ్యను సగానికి పైగా కోసేశారు. విశాఖ జిల్లా పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో 3,26,494 మంది మంది విద్యార్థులున్నారు. ప్రభుత్వం మాత్రం.. 1,90,907 మందికి మాత్రమే డబ్బులు జమ చేస్తోంది. అందులో కూడా రూ.2 వేలు, కొందరికి అంతకంటే ఎక్కువే కోత పెట్టారు.

మహిళల ఖాతాల్లో ‘సున్నా’!

18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ.1,500 చొప్పున ఇస్తామని ఆశపెట్టారు. విశాఖ జిల్లా జనాభాలో 10,25,151 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. వీరిలో పింఛన్లు తీసుకుంటున్న వృద్ధ మహిళలు, ఉద్యోగుల్ని వదిలితే.. మిగిలిన వారిలో దాదాపు 8 లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారు. రెండేళ్లలో ఒక్కో మహిళకు రూ.36 వేలు చొప్పున చెల్లించాల్సి ఉండగా.. రూపాయి కూడా విదల్చలేదు. రెండేళ్లలో చంద్రబాబు ప్రభుత్వం మహిళలకు చేసిన మోసం విలువ రూ.2,880 కోట్లు. ఉచిత బస్సు ప్రయాణం మినహా విశాఖ మహిళలకు ఒరిగింది శూన్యమే.

అంతా ‘గ్యాస్‌’కబుర్లే..

ఏడాదికి 3 ఉచిత గ్యాస్‌ సిలిండర్లు ఇస్తామని చెప్పారు. జిల్లాలో 5.17 లక్షల రేషన్‌ కార్డులున్నాయి. వీరంతా ఈ పథకానికి అర్హులే. కానీ.. కేవలం 3.71 లక్షల గృహాలకు మాత్రమే ఈ పథకం వర్తిస్తోంది. రెండేళ్లలో ప్రతి ఇంటికీ 6 సిలిండర్లు ఉచితంగా ఇవ్వాల్సి ఉండగా, కేవలం ఒకటి, రెండు ఇచ్చి చేతులు దులిపేసుకుంటున్నారు. వీరిలో 50 శాతం మందికి మాత్రమే రాయితీ డబ్బులు అందడం మరో విచిత్రం.

వెన్నుపోటుకు రెండేళ్లు

అడుగడుగునా ప్రజలను మోసం చేస్తూ, రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్న చంద్రబాబు దగా పాలనపై వైఎస్సార్‌సీపీ ‘వెన్నుపోటుకు రెండేళ్లు’పేరుతో ప్రతి వీధిలో, ప్రతి వాడలో నిరసన గళం విప్పుతోంది. మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే వరకు పోరాటం ఆగదని స్పష్టం చేస్తోంది.

గురువారం మండల కేంద్రాల్లో, వార్డుల్లో నిరసన ప్రదర్శనలు

8, 9 తేదీల్లో చంద్రబాబు ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ టౌన్‌ హాల్‌ సమావేశాలు

12న నియోజకవర్గ కేంద్రాల్లో భారీ ర్యాలీలు, ఎన్నికల సమయంలో కూటమి నేతలు ఇచ్చిన బాండ్‌ పేపర్ల దహనం

పడకేసిన విద్య, వైద్యం

గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో కార్పొరేట్‌ స్థాయిలో వెలుగొందిన ప్రభుత్వ పాఠశాలలు, ఆస్పత్రుల రూపురేఖలు.. చంద్రబాబు రెండేళ్ల పాలనలో పూర్తిగా మసకబారాయి. ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలు, డాక్టర్లు, మందుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఆరోగ్యశ్రీ బిల్లులు పెండింగ్‌లో పడిపోవడంతో పేదలకు కార్పొరేట్‌ వైద్యం గగనంగా మారింది. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు పేరుకుపోవడంతో విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరంగా తయారైంది. రైతు భరోసా, సున్నా వడ్డీ రుణాలు వంటి పథకాల అమలులో తీవ్ర జాప్యం కారణంగా రైతులు, డ్వాక్రా మహిళలు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

విశాఖకు అడుగడుగునా ద్రోహం

అభివృద్ధికి కేరాఫ్‌ అడ్రస్‌గా, పరిపాలనా రాజధానిగా ఎదుగుతున్న విశాఖ నగరాన్ని చంద్రబాబు సర్కారు పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. విశాఖ ప్రజలకు ఇచ్చిన హామీలను గాలికి వదిలేసి, ఉత్తరాంధ్ర గుండెకాయపై కత్తి పెట్టింది. విశాఖ ఉక్కుని కాపాడుకుంటామంటూ బీరాలు పలికిన చంద్రబాబు.. అధికారంలోకి వచ్చిన తరవాత.. ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేసేందుకు పూర్తిగా కేంద్రానికి సహకారం అందిస్తున్నారు. ఏళ్ల తరబడి కార్మికులు రోడ్డెక్కి పోరాడుతున్నా, ప్రభుత్వం నుంచి కనీస స్పందన లేదు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement