రిప్‌ కరెంట్‌ల గుర్తింపునకు సమష్టి కృషి అవసరం | - | Sakshi
Sakshi News home page

రిప్‌ కరెంట్‌ల గుర్తింపునకు సమష్టి కృషి అవసరం

Jun 4 2026 7:09 AM | Updated on Jun 4 2026 7:09 AM

కోస్టల్‌ సేఫ్టీపై జాతీయ సదస్సులో ఐజీ గోపీనాథ్‌ జెట్టి

మద్దిలపాలెం: సముద్ర తీరాల్లో ప్రమాదకర రిప్‌ కరెంట్‌లను గుర్తించడం, ప్రాణనష్ట నివారణకు పరిశోధన సంస్థ లు, ప్రభుత్వ యంత్రాంగం సమష్టిగా కృషి చేయాలని కోస్టల్‌ సెక్యూరిటీ ఐజీ గోపీనాథ్‌ జెట్టి పిలుపునిచ్చారు. బుధవారం ఏయూలో ‘స్ట్రేటజీస్‌ ఫర్‌ కోస్టల్‌ సేఫ్టీ, రిప్‌ కరెంట్‌ మేనేజ్‌మెంట్‌’ అనే అంశంపై ఒకరోజు జాతీయ సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఐజీ మాట్లాడుతూ.. తీర ప్రాంతాల్లో నిరంతర పర్యవేక్షణ, నిఘా ఎంతో అవసరమన్నారు. గతేడాది రిప్‌ కరెంట్‌ల కారణంగా 69 మంది మృతి చెందగా, ప్రభుత్వ ముందస్తు చర్యల వల్ల 2024లో ఈ మరణాల సంఖ్య 39కి పరిమితమైందని వెల్లడించారు. రాష్ట్రంలో ఏటా సగటున 45 నుంచి 50 మంది రిప్‌ కరెంట్‌ల వల్ల మృత్యువాత పడుతున్నారని తెలిపారు. ఇస్రో శాస్త్రవేత్త ఎస్‌.వి.వి.అరుణ్‌కుమార్‌ మాట్లాడుతూ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) సాంకేతికతను ఉపయోగించి రిప్‌ కరెంట్‌లను ముందే గుర్తించి, ప్రాణనష్టం జరగకుండా తీసుకుంటున్న చర్యలను వివరించారు. ఏయూ ఉపకులపతి ఆచార్య జి.పి.రాజశేఖర్‌ మాట్లాడుతూ రిప్‌ కరెంట్‌ల నుంచి ఎలా సురక్షితంగా బయటపడాలో ప్రజల్లో అవగాహన పెంచాలని సూచించారు. ఏయూ విభాగాధిపతి ఆచార్య సి.వి.నాయుడు ఈ రంగంలో జరుగుతున్న పరిశోధనలను వివరించారు. ఈ కార్యక్రమంలో కోస్టర్‌ సెక్యూరిటీ పోలీస్‌ ఎస్పీ కె.శ్రావణి, పలువురు రక్షణ రంగ నిపుణులు, అధ్యాపకులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement