మహారాణిపేట: పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నియంత్రణ, సహజ వనరుల సంరక్షణ విషయంలో ప్రతి ఒక్కరూ బాధ్యతతో వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ ఎం.అభిషిక్త్ కిశోర్ సూచించారు. పరిశుభ్రమైన, హరిత వాతావరణాన్ని భావితరాలకు అందించడం మనందరి బాధ్యత అని అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం–2026 సందర్భంగా ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి(ఏపీపీసీబీ)–విశాఖపట్నం విభాగం రూపొందించిన అవగాహన పోస్టర్‌ను కలెక్టరేట్ సమావేశ మందిరంలో పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి, ఇతర ఉన్నతాధికారులతో కలిసి కలెక్టర్ బుధవారం ఆవిష్కరించారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం–2026 సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ఉద్దేశంతో రూపొందించిన ఈ పోస్టర్‌లో ఈ ఏడాది థీమ్(ప్రకృతి ప్రేరణతో–పర్యావరణ పరిరక్షణకై , మన భవిష్యత్తుకై )ను ప్రతిబింబిస్తూ కీలక అంశాలను పొందుపరిచారు. పరిశుభ్రమైన పర్యావరణం వల్ల ఆరోగ్యకరమైన జీవనం, హరిత సమాజాల నిర్మాణం, పునరుత్పాదక ఇంధన వినియోగం, స్థిరమైన అభివృద్ధి సాధ్యమవుతాయని పోస్టర్ ద్వారా ప్రజలకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏపీపీసీబీ అధికారులు ముకుందరావు, ఈపీడీసీఎల్ సీఎండీ ఇమ్మడి పృథ్వీతేజ్, జాయింట్ కలెక్టర్ గొబ్బిళ్ల విద్యాధరి, జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్, వీఎంఆర్డీఏ కమిషనర్ తేజ్ భరత్, డీసీపీలు లతామాధురి, మణికంఠ, డీఆర్వో ఎం.విశ్వేశ్వరనాయుడు, ఆర్డీవో శేషశైలజ తదితరులు పాల్గొన్నారు.


