టీడీపీ ప్రభుత్వ పాలనపై వైఎస్సార్ సీపీ నిరసన కార్యక్రమాలు ‘వెన్నుపోటుకు రెండేళ్లు’ పోస్టర్ ఆవిష్కరణలో పార్టీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు
సాక్షి, విశాఖపట్నం: చంద్రబాబు అధికారంలోకి వచ్చిన ఈ రెండేళ్లలో మోసం, దుర్మార్గం, అరాచకం, వెన్నుపోటు పాలనే నడుస్తోందని వైఎస్సార్‌సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు ధ్వజమెత్తారు. ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు అబద్ధాలతో డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. మద్దిలపాలెంలోని పార్టీ కార్యాలయంలో కేకే రాజు ఆధ్వర్యంలో మంగళవారం జరిగిన ముఖ్య నేతల సమావేశంలో ‘వెన్నుపోటుకు రెండేళ్లు’ పోస్టర్, బుక్‌లెట్‌ను సమన్వయకర్తలు తిప్పల దేవన్‌రెడ్డి, మొల్లి అప్పారావు, పీఏసీ సభ్యుడు తిప్పల నాగిరెడ్డి, మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు, మాజీ ఎమ్మెల్యే తైనాల విజయ్‌కుమార్ తదితరులతో కలిసి ఆవిష్కరించారు. క్యూఆర్ కోడ్ ద్వారా ఈ బుక్‌లెట్‌ను డౌన్‌లోడ్ చేసుకునే సౌకర్యం కల్పించారు.
ఈ సందర్భంగా కేకే రాజు మాట్లాడుతూ.. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో సంక్షేమ పథకాల ద్వారా లబ్ధిదారుల ఖాతాల్లోకి నేరుగా నగదు జమ అయ్యేదని, నేడు ఆ పథకాలు నిలిచిపోవడంతో డ్వాక్రా మహిళలు, విద్యార్థులు, పేదలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆరోగ్యం, విద్యా రంగాల్లో ప్రభుత్వ సాయం గణనీయంగా పడిపోయిందని మండిపడ్డారు. డ్వాక్రా మహిళల బ్యాంకు రుణాల పరిమాణాన్ని తగ్గించేశారని పేర్కొన్నారు. మెగా డీఎస్సీ నియామకాల్లో ఎంపికల తర్వాత నిబంధనలు మార్చి అభ్యర్థులకు అన్యాయం చేశారని ధ్వజమెత్తారు. దీనిపై వస్తున్న ప్రశ్నల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు ఇసుక, బైజూస్ అంశాలను తెరపైకి తెస్తూ, వైఎస్సార్‌సీపీ నాయకులపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు ప్రజలు, మేధావులు నిరసనల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. జూన్ 4న జిల్లాలో అన్ని మండల కేంద్రాల్లో నిరసనలు, 8, 9 తేదీల్లో టౌన్‌హాల్ సమావేశాలు, 12న నియోజకవర్గ కేంద్రాల్లో భారీ ర్యాలీలు నిర్వహించి, అదేరోజున పవన్ కళ్యాణ్ ఇచ్చిన బాండ్ పేపర్ల దహనం కార్యక్రమం చేయాలని పార్టీ పిలుపునిచ్చిందన్నారు.
సమావేశంలో నియోజకవర్గ పరిశీలకులు పేడాడ రమణికుమారి, డాక్టర్ జహీర్ అహ్మద్, జిల్లా పార్టీ పర్యవేక్షకులు గుడిమెట్ల రవిరెడ్డి, మాజీ డిప్యూటీ మేయర్ కటుమూరి సతీష్, పార్టీ ముఖ్యనాయకులు రొంగలి జగన్నాఽథం, మంచ నాగమల్లేశ్వరి, తాడి జగన్నాథరెడ్డి, కిరణ్‌రాజు, పల్లా దుర్గారావు, ప్రసాద్‌రాజు, వెంకటరమణి, కటారి అనిల్‌కుమార్‌రాజు, బొల్లవరపు జాన్‌వెస్లీ, ఎస్‌కే మహంతి, ద్రోణంరాజు శ్రీవాత్సవ్, జీలకర్ర నాగేంద్ర, జీవీ రవిరాజు, సేనాపతి అప్పారావు, అంబటి శైలేష్, ముట్టి సునీల్ కుమార్, సనపల రవీంద్ర భరత్, బోని శివరామకృష్ణ, భర్కత్ అలీ, రాయపురెడ్డి అనిల్ కుమార్, కర్రి రామారెడ్డి, పీలా ప్రేమ కిరణ్ జగదీష్, శ్రీదేవివర్మ, దేవరకొండ మార్కండేయులు, బొండా ఉమామహేశ్వరరావు, నీలి రవి, మనోజ్‌కుమార్, మారుతిప్రసాద్, కోడూరు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.


