డాబాగార్డెన్స్: జీవీఎంసీ ఆస్తులు, పౌరసేవల ప్రైవేటీకరణకు సంబంధించిన జీవో నం.673ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఎం విశాఖ జిల్లా కమిటీ మంగళవారం జీవీఎంసీ ప్రధాన కార్యాలయం వద్ద నిరసన చేపట్టింది. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి మరడాన జగ్గునాయుడు మాట్లాడుతూ పార్కు లు, కల్యాణ మండపాలు, మార్కెట్లు, స్థలాలు తదితర ప్రజా ఆస్తులను ప్రభుత్వ–ప్రైవేట్ భాగస్వామ్యం పేరిట 90 ఏళ్ల లీజుకు ప్రైవేట్ వ్యక్తులు, సంస్థలకు అప్పగించడం ప్రజా ప్రయోజనాలకు విరుద్ధమన్నారు. ప్రజల పన్నులతో నిర్మించిన ఆస్తులను ప్రైవేట్ సంస్థలకు కట్టబెట్టే హక్కు ప్రభుత్వానికి లేదని పేర్కొన్నారు. ప్రజలకు ఉచితంగా అందాల్సిన పౌరసేవలపై యూజర్ చార్జీలు, ఇతర రుసుములు విధించే పరిస్థితి ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
జీవీఎంసీ మాజీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బొడ్డు గంగారావు మాట్లాడుతూ వీధిలైట్లు, రహదారులు, మంచినీటి సరఫరా, భూగర్భ డ్రైనేజీ, పారిశుద్ధ్య సేవల నిర్వహణను ప్రైవేట్ సంస్థలకు అప్పగిస్తే ప్రజలపై అదనపు ఆర్థిక భారం పడుతుందన్నారు. జీవీఎంసీ ప్రధాన కార్యాలయం, ఇండోర్ స్టేడియం, క్రీడా మైదానాలు, మార్కెట్లు, ఇతర ఆస్తులు ప్రైవేట్ నియంత్రణలోకి వెళ్లే ప్రమాదం ఉందని చెప్పారు. స్థానిక సంస్థల ఆదాయ వనరులు బలహీనపడే అవకాశం ఉందన్నారు. జీవో 673ను వెంటనే ఉపసంహరించకపోతే ప్రజా ప్రతిఘటన తప్పదని హెచ్చరించారు. కార్యక్రమంలో ఆర్‌కేఎస్‌వీ కుమార్, వి.కృష్ణారావు, బి.పద్మ, ఎం.సుబ్బారావు, బొట్టా ఈశ్వరమ్మ, నరేంద్ర, ఎల్‌జే నాయుడు, ఆర్‌ఎన్ మాధవి, వెంకట్రావు, కుమారి తదితరులు పాల్గొన్నారు.


