మహారాణిపేట: జిల్లాలో ప్రభుత్వ సేవల్లో మెరుగుదల, ప్రజల సంతృప్తి స్థాయి పెంపొందించడం, 2026–27 సంవత్సర లక్ష్యాల సాధనకు సమర్థవంతమైన కార్యాచరణ రూపొందించడంలో యంగ్ ప్రొఫె షనల్స్ కీలక పాత్ర పోషించాలని కలెక్టర్ ఎం.అభిషిక్త్ కిశోర్ సూచించారు. కలెక్టరేట్‌లో నియోజకవర్గాల విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ యంగ్ ప్రొఫెషనల్స్, అధికారులతో మంగళవారం సమగ్రంగా చర్చించారు. జిల్లాలో వివిధ శాఖల కీలక పనితీరు సూచికలు(కేపీఐ), ప్రజాభిప్రాయ సర్వేలు, సేవల అందజేత ప్రమాణాల ఆధారంగా సమీక్షించారు. జిల్లాలో అమలవుతున్న విజన్ యాక్షన్ ప్లాన్ కార్యక్రమాల పురోగతిని ఆరా తీశారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను మరింత సమర్థవంతంగా నిర్వహించి, ఫిర్యాదుల పరిష్కారంలో జాప్యానికి తావులేకుండా చూడాలన్నారు. పీ–4లో భాగంగా సామాజిక బాధ్యత కార్యక్రమాల కింద సహాయ సహకారాలు అందించాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కమ్యూనిటీ అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయాలని సూచించారు. విజన్ యూనిట్లు.. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థతో కలిసి పని చేయాలన్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా పారదర్శకత, జవాబుదారీతనంతో కూడిన పరిపాలన అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. దీనికి అనుగుణంగా విజన్ యూనిట్లు పనిచేయాలని స్పష్టం చేశారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ గొబ్బిళ్ల విద్యాధరి, సీపీవో శ్రీనివాసరావు, పీజీఆర్‌ఎస్ నోడల్ అధికారి టి.గోవిందు, జిల్లాలోని ఏడు నియోజకవర్గాల విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ సభ్యులు, అధికారులు పాల్గొన్నారు.
విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ సభ్యులు,
అధికారులతో కలెక్టర్ అభిషిక్త్ కిశోర్ సమీక్ష


