డాబాగార్డెన్స్: మన శంకర వరప్రసాద్ సినిమా తొలి డిస్ట్రిబ్యూటర్ బత్తుల సత్యనారాయణ(లీలామహల్ సతీష్) బ్లాక్ మెయిలర్ అని సినీ నిర్మాత నట్టి కుమార్ ఆరోపించారు. నగరంలోని వీజేఎఫ్ ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బత్తుల సత్యనారాయణ లీలామహల్ థియేటర్ లీజుకు తీసుకుని నడుపుతున్నారని తెలిపారు. సినిమా హక్కుల కోసం అఖండ–2 సినిమాకు రూ.2 కోట్లు ఇచ్చానని, సినిమా ఫ్లాప్ అయ్యిందని పేర్కొన్నారు. మన శంకర వరప్రసాద్ సినిమాకి తొలుత రూ.3.57 కోట్లు, తర్వాత ఇంకో రూ.2 కోట్లు.. మొత్తంగా రూ.5.57 కోట్లు ఇచ్చినట్లు వెల్లడించారు. కానీ సతీష్ మధ్యలో సినిమా వదిలేశారని, దీంతో మన శంకర వరప్రసాద్ సినిమా నిర్మాతలు సుష్మిత, సాహు గారపాటితో నేరుగా ఒప్పందం చేసుకుని 6 జిల్లాల్లో సినిమా విడుదల చేయడం జరిగిందన్నారు. దిల్ రాజుకు బకాయిలు ఉండి తనకు సొమ్ము ఎగ్గొట్టారని ఆరోపించారు. నిర్మాతలు బెల్లం కొండ సురేష్, అనిల్ సుంకరలపై 2024లో ఫిర్యాదులు చేసి అప్పుడు కూడా బాకీ ఎగ్గొంటేందుకు సతీష్ ప్రయత్నాలు చేశారని పేర్కొన్నారు. తనకు రావాల్సిన డబ్బులు వెంటనే చెల్లించాలని లేకుంటే న్యాయపరమైన చర్యలకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు.
సినీ నిర్మాత నట్టి కుమార్ ఆరోపణ


