సాక్షి, విశాఖపట్నం: భారతీయ రైల్వే వ్యవస్థలో 18వ జోన్‌గా విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యకలాపాలు సోమవారం లాంఛనంగా ప్రారంభమయ్యాయి. వీఎంఆర్‌డీఏ డెక్ భవనంలో ఏర్పాటు చేసిన తాత్కాలిక కార్యాలయంలో జోన్ జనరల్ మేనేజర్ సందీప్ మాథుర్ కార్యకలాపాలను నిరాడంబరంగా ప్రారంభించారు. రైల్వే శాఖ రూపొందించిన జోన్ అధికారిక మ్యాప్(సిస్టమ్ మ్యాప్)ని విడుదల చేశారు. దేశ రవాణా వ్యవస్థలో అత్యంత కీలకమైన నెట్‌వర్క్‌గా రూపుదిద్దుకున్న ఈ జోన్.. ఏకంగా నాలుగు రాష్ట్రాల పరిధిలో విస్తరించి తన భౌగోళిక, వ్యూహాత్మక ప్రాధాన్యతను చాటుకుంది. మొత్తం 3,532 కిలోమీటర్ల సువిశాల విస్తీర్ణం(రూట్ నెట్‌వర్క్), 6,455 కిలోమీటర్ల భారీ రైల్వే ట్రాక్‌లైన్‌తో దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మక జోన్‌లలో ఒకటిగా అవతరించింది. పూర్తి స్థాయి జోనల్ కార్యకలాపాలు మొదలయ్యేసరికి మరో నెల రోజుల సమయం పట్టే అవకాశం ఉందని రైల్వే అధికారులు స్పష్టం చేశారు.
భద్రతకే ప్రథమ ప్రాధాన్యం : అనంతరం జీఎం ప్రిన్సిపల్ హెడ్ ఆఫ్ డిపార్ట్‌మెంట్స్, నాలుగు డివిజన్ల డీఆర్‌ఎంలతో కలిసి మొట్టమొదటి ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో ఆయా డివిజన్ల పరిధిలో కొనసాగుతున్న అభివృద్ధి పనులు, మౌలిక సదుపాయాల కల్పన, భవిష్యత్తు కార్యాచరణపై అధికారులతో జీఎం సుదీర్ఘంగా చర్చించారు. కొత్త జోన్‌లో విలీనమవుతున్న తమ డివిజన్ల గురించి ఆయా డీఆర్‌ఎంలు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఆస్తుల నిర్వహణ, మానవ వనరుల నిర్వహణ, భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లు, వాటి పరిష్కార మార్గాలపై సమావేశంలో కూలంకషంగా చర్చించారు. ఈ సమీక్షలో విశాఖపట్నం డీఆర్‌ఎం లలిత్ బోహ్రా, విజయవాడ డీఆర్‌ఎం మోహిత్ సోనాకియా, గుంటూరు డీఆర్‌ఎం సుదేష్ణసేన్, గుంతకల్లు డీఆర్‌ఎం చంద్రశేఖర్ గుప్తాతో పాటు వివిధ శాఖల హెచ్‌వోడీలు, సీనియర్ అధికారులు పాల్గొన్నారు.


