మహారాణిపేట: సమాచార, పౌర సంబంధాల శాఖ రీజనల్ జాయింట్ డైరెక్టర్ (ఆర్జేడీ)గా పదవీ విరమణ చేసిన వడలి మణిరామ్‌ను పలు జర్నలిస్టు సంఘాల ప్రతినిధులు ఆదివారం సత్కరించారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఆయనకు దుశ్శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ సందర్భంగా లోకల్ న్యూస్ పేపర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పి.సత్యనారాయణ మాట్లాడుతూ మణిరామ్ జర్నలిస్టులకు ఎంతో సహకారం అందించారని తెలిపారు. ప్రెస్ అక్రిడేషన్ల జారీ, జర్నలిస్టులకు వైద్య పరీక్షలు, వైద్య బీమాకు కలెక్టర్ నుంచి సహకారం, చిన్న పత్రికలకు ఎంప్యానల్‌మెంట్ లాంటి విషయాల్లో ఆయన ఎంతో చొరవ చూపారని పేర్కొన్నారు. విశాఖ న్యూస్ పేపర్స్ పబ్లిషర్ సొసైటీ కోశాధికారి కె.పరశురాం మాట్లాడుతూ జర్నలిస్టులకు, స్థానిక పత్రికలకు ఏవైనా సాంకేతిక పరమైన సమస్యలు ఎదురైతే, వాటిపై తగిన సలహాలు సూచనలు ఇచ్చి మణిరామ్ ఎంతో సహకరించారన్నారు. ఈ కార్యక్రమంలో పాత్రికేయులు పూజారి సత్యనారాయణ, హరనాథ్, వీరాభిమన్యుడు, మొల్లి కమల్‌కుమార్, కె.సంతోష్‌కుమార్, ఎం.శ్రీహరి, రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


