ప్రతి ఆదివారం చిన్నారులకే సొంతం | - | Sakshi
Sakshi News home page

ప్రతి ఆదివారం చిన్నారులకే సొంతం

Jun 1 2026 1:02 AM | Updated on Jun 1 2026 1:02 AM

● బాల వికాస తరంగిణి పేరిట ప్రత్యేక కార్యక్రమాలు ● మెట్రోపాలిటన్‌ కమిషనర్‌ ఎన్‌.తేజ్‌ భరత్‌

బీచ్‌రోడ్డు: బాలలు తమకు నచ్చిన రంగాల్లో రాణించేలా తీర్చిదిద్దేందుకు బాల వికాస తరంగిణి పేరిట ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు వీఎంఆర్‌డీఏ మెట్రోపాలిటన్‌ కమిషనర్‌ ఎన్‌.తేజ్‌ భరత్‌ తెలిపారు. వీఎంఆర్‌డీఏ ఆధ్వర్యంలో, వైజాగ్‌ వలంటీర్స్‌ సహకారంతో సిరిపురంలోని చిల్డ్రన్స్‌ ఎరీనాలో ఆదివారం ‘బాలల సందడి–సాంస్కృతిక కార్యక్రమాలు’ పేరిట ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన కమిషనర్‌ తేజ్‌ భరత్‌ మాట్లాడుతూ బాలలను మేటి పౌరులుగా తీర్చిదిద్దేందుకు ఇకపై ప్రతి ఆదివారం చిల్డ్రన్స్‌ థియేటర్‌ను పూర్తిస్థాయిలో బాలల కోసమే కేటాయిస్తామని స్పష్టం చేశారు. పిల్లలకు వినోదం, విజ్ఞానంతో పాటు సరికొత్త నైపుణ్యాలు అందించేలా వీఎంఆర్‌డీఏ భవిత పేరిట విధివిధానాలను త్వరలోనే రూపొందిస్తామని వెల్లడించారు. చిత్రలేఖనం, నాట్యం, సంగీతం, భావ వ్యక్తీకరణతో పాటు ఏఐ సాంకేతికత వంటి ఆధునిక అంశాల్లో చిన్నారులు రాణించేలా స్వచ్ఛంద సంస్థల సహకారంతో ప్రతి ఆదివారం కొత్తదనంతో కూడిన శిక్షణ ఇస్తామని వివరించారు. ఈ సందర్భంగా నగరంలోని ఆరాధన చిల్డ్రన్‌ హోం, సంకల్ప బాలల హోం, మనస్వి హోం, పాపా హోం, డాన్‌ బాస్కో తదితర సంస్థల చిన్నారులు పాల్గొని తమ ఆటపాటలు, నృత్యాలతో సందడి చేశారు. ఈ కార్యక్రమంలో వీఎంఆర్‌డీఏ ముఖ్య గణాంక అధికారి హరి ప్రసాద్‌, కార్యదర్శి మురళీకృష్ణ, బాల వికాస్‌ ఫౌండేషన్‌ వ్యవస్థాపకుడు నరవ ప్రకాశరావు, జిల్లా బాలల సంక్షేమ అధికారి హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement