కొమ్మాది: ఎండాడ జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ ఆటో డ్రైవర్ మరణించాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. ఆదివారం తెల్లవారుజామున పీఎం పాలెం నుంచి పెనగంటి నరసింహమూర్తి తన ఆటోలో మంచాలను ఎండాడకు తీసుకు వెళ్తున్నారు. ఎండాడ సిగ్నల్ పాయింట్ దాటాక వెనుక నుంచి వస్తున్న ఓ లారీ ఆటోను బలంగా ఢీ కొట్టింది. నరసింహమూర్తి రోడ్డు మీద పడిపోవడంతో తలకు తీవ్ర గాయాలై, అక్కడికక్కడే మృతి చెందాడు. లారీ డ్రైవర్ సంఘటనా స్థలం నుంచి పరారయ్యాడు. అదే సమయంలో ద్వారకా ట్రాఫిక్ సర్కిల్‌కు చెందిన ఎన్‌వీ ప్రభాకర్ విశాఖవ్యాలీ ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్నారు. ఓ ద్విచక్ర వాహనదారుడు అందించిన సమాచారం ఆధారంగా మద్దిలపాలెం వద్ద ట్రాఫిక్ విధుల్లో ఉన్న ట్రాఫిక్ ఎస్‌ఐ రామ్మూర్తికి సమాచారం అందించారు. అప్రమత్తమైన రామ్మూర్తి లారీ డ్రైవర్‌ను ఆపి, అదుపులోకి తీసుకున్నారు. మృతుడి బంధువులకు పోలీసులు సమాచారం అందించారు. ఆరిలోవ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


