క్షతగాత్రులకు మెరుగైన వైద్యం | - | Sakshi
Sakshi News home page

క్షతగాత్రులకు మెరుగైన వైద్యం

Jun 1 2026 12:56 AM | Updated on Jun 1 2026 12:56 AM

● గాజువాక ఘటనపై మంత్రుల దిగ్భ్రాంతి ● అన్నివిధాలా అండగా ఉంటామన్న కలెక్టర్‌

మహారాణిపేట: గాజువాకలో జరిగిన ఆర్టీసీ బస్సు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, తొమ్మిది మంది గాయపడ్డారు. మృతులను సాలూరుకు చెందిన రాయంపిల్లి రాంబాబు (50), రాజమండ్రి సమీపంలోని సీతంపేటకు చెందిన రాలి రాధా మాధవి (35), లెంకా ఈశ్వరమ్మ (55)గా గుర్తించారు. కేజీహెచ్‌లో పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఎం. శ్రీనివాసరావు, ఆర్‌. తన్విత, కనకం రాజు, ప్రశాంతి, శివసూర్య నాగేశ్వరరావు, కె. రామకృష్ణ, ఎస్‌. జమ్మయ్య (బస్సు డ్రైవర్‌) కేజీహెచ్‌లో చికిత్స పొందుతుండగా తీవ్రంగా గాయపడిన కె. లలితను ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.

బాధితులను పరామర్శించిన మంత్రులు

ప్రమాద ఘటనపై రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌ రెడ్డి, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించి, మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.ప్రమాదానికి గల కారణాలపై సమగ్ర విచారణ జరిపి నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు. ఇన్‌చార్జి మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి కూడా ప్రమాదంపై విచారం వ్యక్తం చేశారు. కలెక్టర్‌ ఎం.అభిషిక్త్‌ కిశోర్‌ బాధితులకు ధైర్యం చెప్పారు. మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులను, వైద్య సిబ్బందిని ఆదేశించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందన్నారు.కలెక్టర్‌ వెంట డిప్యూటీ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రాధాకృష్ణ, ఇన్‌చార్జ్‌ సీఎస్‌ఆర్‌ఎంవో డాక్టర్‌ కుమార్‌, ఆర్‌టీసీ అధికారులు ఉన్నారు.

మృతుల కుటుంబాలకు

రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా

గాజువాక: గాజువాక శ్రీనగర్‌ జంక్షన్‌ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రభుత్వం తరఫున రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా అందజేస్తామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి ఎం. రాంప్రసాద్‌ రెడ్డి తెలిపారు. గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావుతో కలిసి ప్రమాద స్థలాన్ని, దెబ్బతిన్న ఆర్టీసీ బస్సును పరిశీలించారు.

కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement