నిబంధనల వలలో చిక్కిన మత్స్యకారులు
సంధి కాలంలో చంద్రబాబు సర్కార్ షాక్
13,597 మంది లబ్ధిదారుల్లో
40 శాతం మందికి కోత
ఆగ్రహం వ్యక్తం చేస్తున్న గంగపుత్రులు
మహారాణిపేట: చంద్రబాబు ప్రభుత్వం మత్స్యకారుల నోట్లో మట్టి కొట్టింది. నిబంధనల పేరుతో ‘మత్స్యకార భరోసా’ లబ్ధిదారుల్లో కోత పెట్టింది. దీంతో సముద్రాన్ని నమ్ముకున్న గంగపుత్రులు కష్టాల్లో కూరుకుపోయారు. వేట సాగితేనే పూట గడవని మత్స్యకార కుటుంబాలు పస్తులుండాల్సిన పరిస్థితి నెలకొంది. అండగా నిలవాల్సిన ప్రభుత్వం కొత్త నిబంధనల పేరిట లబ్ధిదారులకు ఎగనామం పెడుతోంది. డీజిల్ సబ్సిడీ వాడలేదనే సాకుతో భరోసాను పక్కన పెట్టడంతో మత్స్యకారుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.
చేతిలో పైసల్లేవు.. అప్పులే దిక్కు
విశాఖ జిల్లాలోని 32 కిలోమీటర్ల తీర ప్రాంతంలో ఉన్న 15 మత్స్యకార గ్రామాలు, 30 ఫిష్ ల్యాండింగ్ కేంద్రాలు ఉన్నాయి. 668 మరపడవలు, 1272 మోటారు, 428 సాంప్రదాయ బోట్ల కార్మికులు సముద్రాన్నే నమ్ముకుని జీవనం సాగిస్తున్నారు. సముద్రంలో వేట నిలిపివేసి 40 రోజులు దాటిపోయింది. చేతిలో పైసలు లేక మత్స్యకార కుటుంబాలు అల్లాడుతున్నాయి. ఆకలి తీర్చుకోడానికి అప్పుల కోసం తిరుగుతున్నారు. దొరికిన కాడికి చేబదుళ్లు తెచ్చుకుంటున్నారు. వీటికి భారీగా వడ్డీలు చెల్లించాల్సి వస్తోందని వాపోతున్నారు. ప్రభుత్వం ఇచ్చే సంధికాలపు భత్యం సకాలంలో అందితే ఈ కష్టాలు తప్పుతాయని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కూటమి సర్కార్ కాలయాపన
మత్స్య సంపద సంరక్షణ కోసం ప్రతి ఏటా ఏప్రిల్ 15 నుంచి జూన్ 15 వరకు అంటే 61 రోజుల పాటు సముద్రంలో వేటను నిషేధిస్తారు. ఈ సమయంలో మత్స్యకారులను ఆదుకోవడానికి గత ప్రభుత్వం వైఎస్సార్ మత్స్యకార భరోసాను తెచ్చింది. ప్రతి లబ్ధిదారునికి రూ. 10 వేలు చొప్పున సాయం అందించేది. వేట నిషేధ కాలంలోనే ఈ నిధులు మత్స్యకారుల ఖాతాల్లో జమ అయ్యేవి. కానీ ప్రస్తుత కూటమి ప్రభుత్వం మత్స్యకారులను ఘోరంగా వంచించింది. అధికారులు 13,597 మందితో లబ్ధిదారుల జాబితా తయారు చేసినా లాభం లేకుండా పోయింది. కేవలం 60 శాతం మందికే నిధులు ఇచ్చి, మిగిలిన 40 శాతం మందికి మొండిచేయి చూపింది.
నిబంధనల పేరిట లబ్ధిదారుల కోత
అర్హుల ఎంపికలో ప్రభుత్వం దారుణమైన నిబంధనలను తెరపైకి తెచ్చింది. ఒకే ఇంట్లో ఎంతమంది మత్స్యకారులు ఉన్నా ఒక్కరికే పథకాన్ని పరిమితం చేసింది. ఉమ్మడి కుటుంబంలో తండ్రికి సాయం అందితే కొడుకులకు భరోసా కట్ చేసింది. మత్స్యశాఖలో రిజిస్ట్రేషన్ లేని బోట్లు, లైసెన్స్ లేని బోట్లలో పనిచేసే వారిని పక్కన పెట్టేసింది. వీటికి తోడు నెలకు 300 యూనిట్ల కంటే ఎక్కువ కరెంట్ బిల్లు వచ్చినా లబ్ధిదారుల జాబితా నుంచి తొలగిస్తోంది. రకరకాల సాకులు చెబుతూ గంగపుత్రుల పొట్ట కొడుతోంది. ప్రభుత్వం తక్షణమే స్పందించి ఆంక్షలన్నీ తొలగించాలని, అర్హులైన ప్రతి మత్స్యకారుడికి వెంటనే భరోసా నిధులు విడుదల చేయాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.
హార్బర్‌లో నిలిచిన బోట్లు


