మహారాణిపేట: కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ‘అర్బన్ చాలెంజ్ ఫండ్’ కింద విశాఖకు రూ.1,500 కోట్ల విలువైన మూడు కీలక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు మంజూరయ్యాయని ఎంపీ ఎం. శ్రీభరత్ తెలిపారు. శనివారం కలెక్టరేట్‌లో కలెక్టర్ అభిషిక్త్ కిశోర్ అధ్యక్షతన జరిగిన జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ (దిశ)సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎంపీ మాట్లాడుతూ ఈ నిధులతో మధురవాడ జోన్‌లో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ, 24 గంటల తాగునీటి సరఫరా, నగరవ్యాప్తంగా బల్క్ వాటర్ సప్లై వ్యవస్థలను అభివృద్ధి చేయనున్నట్లు వెల్లడించారు. కేంద్ర ప్రాయోజిత పథకాల అమలును అధికారులు వేగవంతం చేయాలని, ఎన్టీఆర్ భరోసా పింఛన్లు, గృహ నిర్మాణ పథకాలను పారదర్శకంగా లబ్ధిదారులకు అందించాలని స్పష్టం చేశారు. అలాగే నగరంలో విక్రయించే చికెన్, మటన్ నాణ్యతను ప్రత్యేక బృందాలతో తనిఖీ చేయించి, నాణ్యతా ప్రమాణాల ఆధారంగా గ్రేడింగ్ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు మాట్లాడుతూ అచ్చెన్నాయుడులోవ వద్ద ఏర్పాటు చేయనున్న కొత్త టిడ్కో నివాస సముదాయంలో ముందస్తుగానే కనీస మౌలిక వసతులు కల్పించాలని కోరారు. టిడ్కో, రాజీవ్ గృహకల్ప కింద కేటాయించిన అనేక ఇళ్లలో లబ్ధిదారులు ఉండకపోవడంతో అవి అసాంఘిక కార్యకలాపాలకు కేంద్రాలుగా మారుతున్నాయని గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ఆందోళన వ్యక్తం చేశారు. డీడీలు కట్టి, బ్యాంకు రుణాల ఈఎంఐలు చెల్లిస్తున్నా పేదలకు ఇంకా ఇళ్లు అందకపోవడం బాధాకరమని ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే పి. విష్ణుకుమార్ రాజు ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతోనే విశాఖకు ఉజ్వల భవిష్యత్తు సాధ్యమని కలెక్టర్ అభిషిక్త్ కిశోర్ పేర్కొన్నారు. ఈ సమీక్షలో దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్, జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ పాల్గొన్నారు.
‘దిశ’ సమావేశంలో ఎంపీ శ్రీభరత్


