పొగ..ఆరోగ్యానికి పగ | - | Sakshi
Sakshi News home page

పొగ..ఆరోగ్యానికి పగ

May 31 2026 1:00 AM | Updated on May 31 2026 1:00 AM

● నేడు ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం

ఉత్తరాంధ్రలో పెరుగుతున్న క్యాన్సర్‌ కేసులు

అవగాహన పెరగాలి

పొగాకు వినియోగం వల్ల కలిగే తీవ్రమైన ఆరోగ్య, సామాజిక, ఆర్థిక, పర్యావరణ దుష్పరిణామాలపై ప్రజల్లో అవగాహన పెరగాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా పొగాకు వినియోగం నోటి క్యాన్సర్‌కు ప్రధాన కారణంగా మారుతుండగా, ఇతర రకాల క్యాన్సర్లు కూడా వచ్చే ప్రమాదం ఉంది. అందువల్ల ప్రతి ఒక్క రూ పొగాకు ఉత్పత్తులకు దూరంగా ఉండాలి. రాబోయే తరాలను పొగాకు, నికోటిన్‌ వ్యసనాల బారిన పడకుండా కాపాడేందుకు సమాజం మొత్తం కలిసి కట్టుగా కృషి చేయాల్సిన అవసరం ఉంది.

–డాక్టర్‌ రవి శంకర్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌, ఓమేగా క్యాన్సర్‌ ఆస్పత్రి, విశాఖపట్నం

మహారాణిపేట: పొగాకు వినియోగం కారణంగా ఉత్తరాంధ్రలో క్యాన్సర్‌ కేసులు ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్నాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. సిగరెట్లు, బీడీలతో పాటు అడ్డపొగాకు, జర్దా, ఖైనీ, గుట్కా వంటి పొగాకు ఉత్పత్తుల వాడకం నోటి, గొంతు, ఊపిరితిత్తుల క్యాన్సర్లకు ప్రధాన కారణంగా మారుతోందని వారు పేర్కొంటున్నారు. విశాఖలోని ఆస్పత్రులకు ప్రతి నెలా వందల సంఖ్యలో పొగాకు సంబంధిత క్యాన్సర్‌ రోగులు చికిత్స కోసం వస్తున్నారని తెలిపారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో రైతులు, కూలీలు, మత్స్యకారుల్లో అడ్డపొగాకు వినియోగం అధికంగా ఉందని, ఇది నోటి, నాలుక, గొంతు, ఆహారనాళం క్యాన్సర్లకు దారితీస్తోందని హెచ్చరించారు. అలాగే ఊపిరితిత్తుల క్యాన్సర్‌ కేసుల్లో 80 నుంచి 85 శాతం వరకు పొగతాగడమే ప్రధాన కారణమని వైద్య నిపుణులు పేర్కొన్నారు. పొగతాగేవారితో పాటు పరోక్షంగా పొగ పీల్చే పిల్లలు, మహిళల్లో కూడా శ్వాసకోశ, గుండె సంబంధిత వ్యాధులు, క్యాన్సర్‌ ప్రమాదం పెరుగుతోందని తెలిపారు. ఆదివారం ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా యువత, విద్యార్థులు, గ్రామీణ ప్రజలు పొగాకు ఉత్పత్తులకు దూరంగా ఉండాలని వైద్యులు సూచించారు. పొగాకు అలవాటును మానుకోవడం ద్వారా క్యాన్సర్‌, గుండెజబ్బులు, ఊపిరితిత్తుల వ్యాధుల ప్రమాదాన్ని గణనీయంగా తగ్గించుకోవచ్చని పేర్కొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement