సెంటర్ ఫర్ లిబర్టీ అధ్యక్షుడు చక్రవర్తి
బీచ్‌రోడ్డు: విశాఖలో ఏర్పాటు చేయనున్న గూగుల్ డేటా సెంటర్‌కు అవసరమైన నీరు, విద్యుత్ సరఫరాపై కూటమి ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని సెంటర్ ఫర్ లిబర్టీ అధ్యక్షుడు నలమోతు చక్రవర్తి డిమాండ్ చేశారు. ‘తెలుగు శక్తి’ ఆధ్వర్యంలో శనివారం హోటల్ మేఘాలయలో ఉత్తరాంధ్ర సమస్యలు, అభివృద్ధిపై మేధోమథన సమ్మేళనం నిర్వహించారు. ఈ సదస్సులో ముఖ్యఅతిథిగా పాల్గొన్న చక్రవర్తి మాట్లాడుతూ.. నగరావసరాలకు వాడే విద్యుత్, నీటిని గుగుల్ సెంటర్‌కు మళ్లిస్తారా? లేక డిసాలినేషన్, సొంత విద్యుత్ పద్ధతులను వాడుతారా? అని ప్రశ్నించారు. ఈ ప్రాజెక్ట్ వల్ల కాలుష్య ముప్పు లేదని, ప్రత్యక్షంగా 1000 నుంచి 1500 మందికి, కేబుల్ నిర్మాణం ద్వారా పరోక్షంగానూ ఉపాధి లభిస్తుందని పేర్కొన్నారు. అయితే భారీ సామర్థ్యం గల గూగుల్ సంస్థకు రూ. 20,000 కోట్ల రాయితీలు ఇవ్వడాన్ని ఆయన తప్పుపట్టారు. గతంలో లులు సంస్థ తరహాలోనే, ఇప్పుడు ‘సత్వ’ అనే రియల్ ఎస్టేట్ సంస్థకు 30 ఎకరాల భూమిని ఎకరా రూ. కోటిన్నర చొప్పున కారుచౌకగా కట్టబెట్టడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రజల భూములను ప్రైవేట్ సంస్థలకు ధారాదత్తం చేయడం సరికాదన్నారు. కార్యక్రమంలో తెలుగు శక్తి ప్రతినిధి బీవీ రామ్, డాక్టర్ నమ్మి అప్పలరాజు యాదవ్, పెద్దాడ రమణ, డాక్టర్ పప్పూరు నికుంజ్, పెంట త్రినాథరావు పాల్గొన్నారు.
మాట్లాడుతున్న చక్రవర్తి


