
ప్రభుత్వ భూముల కబ్జాపై ఫిర్యాదు
తిరుపతి రూరల్ : మండలంలో ప్రభుత్వ భూముల కబ్జాపై ఉద్యమం చేపడతామని, ప్రధానంగా పేరూరు పంచాయతీలో ఆక్రమణదారులు రెచ్చిపోతుంటే రెవెన్యూ అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని సర్పంచ్ దామినేటి కేశవులు మండిపడ్డారు. సోమవారం ఈ మేరకు కలెక్టరేట్ గ్రీవెన్స్‌లో కలెక్టర్, జేసీకి ఫిర్యాదు చేశారు. రూ.కోట్ల విలువైన సర్కారు భూములను కాపాడాలని, దీనిపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా తహసీల్దార్ పట్టించుకోవడం లేదని ఆరోపించారు. పేరూరులోని సర్వే నంబర్లు 529/4ఏ, 488, 02లోని ప్రభుత్వ భూముల్లో ఆక్రమంగా నిర్మాణాలు సాగిస్తున్నారన్నారు. 529/4ఏలోని 0.98 సెంట్ల విలువ సుమారు రూ.20 కోట్లు ఉంటుందని వెల్లడించారు. అలాగే సర్వే నంబర్లు 488, 02 సర్వే నంబర్లలో అక్రమ కట్టడాలను తొలగించి హెచ్చరిక బోర్డులు పెట్టాలని విన్నవించారు. ఎంపీపీ మూలం చంద్రమోహన్ రెడ్డి, వైస్ ఎంపీపీ విడుదల మాధవరెడ్డి, నేతలు చెంచుమోహన్‌యాదవ్, చింతల ప్రసాద్, కృష్ణమూర్తిరెడ్డి, రాజారెడ్డి, కార్తీక్ పాల్గొన్నారు.