కాలుష్యానికి చెక్‌.. ఇక హైదరాబాద్‌లో ఎలక్ట్రిక్ బస్సులే..!

TSRTC Going To Buy 300 Electric Buses Telangana Hyderabad - Sakshi

దశలవారీగా సమకూర్చుకునేందుకు ఆర్టీసీ ఏర్పాట్లు 

ఇప్పటికే 360 బస్సులకు టెండర్లు 

10 డబుల్‌ డెక్కర్‌ సహా 300 బస్సులు సిటీకి కేటాయింపు 

హైదరాబాద్‌–విజయవాడ, గుంటూరు మధ్య 50 ఏసీ బస్సులు 

13.5 మీటర్ల పొడవైన బస్సులకు నోటిఫికేషన్‌

సాక్షి, హైదరాబాద్‌: సాధారణ బస్సులకు బదులుగా వీలైనన్ని ఎలక్ట్రిక్‌ బస్సులనే స మకూర్చుకోవాలని ఆర్టీసీ భావిస్తోంది. 360 బస్సులు కొనేందుకు ఇప్పటికే టెండర్లు పిలిచింది. మలి దఫాలో మరో 100 బస్సులు తీసుకునే యోచనలో ఉంది. నగరంలో వాహన కాలుష్యం విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో ఏకంగా 300 బస్సులను సిటీ సర్వీసులుగా తిప్పాలని నిర్ణయించింది.

50 ఏసీ ఎలక్ట్రిక్‌ బస్సులను ఇంటర్‌ స్టేట్‌ సర్వీసులుగా ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలతో అనుసంధానించాలనుకుంటోంది. కొన్ని నాన్‌ ఏసీ, ఏసీ బస్సులను కొని, హైదరాబాద్‌ నుంచి రాష్ట్రంలోని ప్రధాన పట్టణాలకు తిప్పబోతోంది. ఇవన్నీ అద్దె ప్రాతిపదికన సమకూర్చుకోనుంది. ముంబై తరహాలో పది ఏసీ డబుల్‌ డెక్కర్‌ బస్సులనూ హైదరాబాద్‌లో తిప్పబోతోంది.

అద్దెతో భారం తక్కువ.. కాలుష్యానికి చెక్‌.. 
దేశవ్యాప్తంగా వాహన కాలుష్యాన్ని తగ్గించేందుకు ఎలక్ట్రిక్‌ వాహనాలను కేంద్రం ప్రోత్సహిస్తోంది. ఫేమ్‌ పథకం కింద పలు రాష్ట్రాల ప్రజా రవాణా సంస్థలకు ఎలక్ట్రిక్‌ బస్సులను అందించింది. ఆ పథకం తొలి దశలో 40 ఏసీ ఎలక్ట్రిక్‌ బస్సులు తీసుకున్న తెలంగాణ ఆర్టీసీ, రెండో విడతలో 324 బస్సులకు టెండర్లు పిలిచింది. ఏసీ బస్సులకు డిమాండ్‌ అంతగా ఉండటం లేదన్న ఉద్దేశంతో తర్వాత రద్దు చేసుకుంది.

ఇప్పు డు ఆ పథకం కింద కాకపోయినా, దాదాపు అదే సంఖ్యలో నాన్‌ ఏసీ బస్సులు తీసుకుంటోంది. ఇటీవలే వాటికి టెండర్లు పిలిచింది. వాటిని సిటీ బస్సులుగా హైదరాబాద్‌లో తిప్పుతారు. బ్యాటరీ బస్సులు కావటంతో వాతావరణ కాలుష్యం ఉండదు. అద్దె ప్రాతిపదికన తీసుకున్నందున నిర్వహణ, డ్రైవర్‌ ఖర్చు కూడా ఆర్టీసీపై పడదు.

విజయవాడ, గుంటూరులకు ఏసీ బ్యాటరీ బస్సులు.. 
హైదరాబాద్‌ నుంచి విజయవాడ, గుంటూ రు ఏసీ బస్సులకు బాగా డిమాండ్‌ ఉంటోంది. సిటీ నుంచి తిరిగే ప్రైవేటు బస్సుల్లో మూడొంతులు ఈ మార్గాల్లోనే తిరుగుతా యి. కానీ ప్రైవేటు ఆపరేటర్లు బ్యాటరీ బ స్సులను వాడటం లేదు. దాన్ని అనుకూలంగా మార్చుకునేందుకు తొలిసారి ఆ మార్గంలో ఎలక్ట్రిక్‌ బస్సులు ప్రవేశపెట్టాలని ఆర్టీసీ నిర్ణయించింది. మల్టీ యాక్సిల్‌ తరహాలో 13.5 మీటర్ల పొడవుండే భారీ బస్సులను కొనబోతోంది.

కుదుపులు లేకపోవడం, శబ్దం ఉండకపోవటంతో రాత్రి వేళ వీటిలో ప్రయాణించేందుకు ప్రయాణికులు ఆసక్తి చూపుతారని భావిస్తోంది. ఇందుకోసం 50 ఏసీ ఎలక్ట్రిక్‌ బస్సులకు టెండర్లు పిలిచింది. నగరంలో తిప్పేందుకు ఇప్పటికే 10 ఏసీ ఎలక్ట్రిక్‌ డబుల్‌ డెక్క ర్‌ బస్సులకూ నోటిఫికేషన్‌ జారీ చేసింది. వచ్చే మార్చి నాటికి దశలవారీగా ఈ బస్సులన్నీ రోడ్డెక్కనున్నాయి. 

హైదరాబాద్‌ నుంచి జిల్లాలకూ...
హైదరాబాద్‌ నుంచి వరంగల్, కరీంనగర్, మహబూబ్‌నగర్, నిజామాబాద్, ఖమ్మం, ఆదిలాబాద్‌లాంటి పట్టణాలకు తిప్పేందుకు కొన్ని ఏసీ, కొన్ని నాన్‌ఏసీ ఎలక్ట్రిక్‌ బస్సులూ కొనే యోచనలో ఉంది. ప్రస్తుతం బ్యాటరీ చార్జింగ్‌ స్టేషన్లు అందుబాటులో లేక వాటిని తిప్పటం కష్టంగా ఉంది. దీంతో టెండర్లు దక్కించుకునే సంస్థలే ఆ బ్యాటరీ చార్జింగ్‌ సెంటర్లు కూడా నిర్వహించాలన్న కండీషన్‌తో త్వరలో టెండర్‌ నోటిఫికేషన్‌ ఇచ్చేందుకు ఆర్టీసీ ఏర్పాట్లు చేస్తోంది.

ఇప్పటికే 670 సాధారణ బస్సులను సొంతంగా కొంటున్న విషయం తెలిసిందే. క్రమంగా సాధారణ బస్సుల సంఖ్యను తగ్గించుకుంటూ బ్యాటరీ బస్సుల సంఖ్యను పెంచాలన్నది ఆర్టీసీ ఆలోచన.
చదవండి: తెలంగాణ రాష్ట్రానికి గ్రీన్‌ చాంపియన్‌ అవార్డు

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top