ఉచిత విద్యుత్‌ ఘనత వైఎస్సార్‌దే: సీఎం కేసీఆర్‌

TS CM KCR Once Again Praises YSR On Free Power - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఉచిత విద్యుత్‌ అమలు చేసిన ఘనత దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డిదేనని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు మరోసారి పునరుద్ఘాటించారు. ఉచిత విద్యుత్‌ తాము అమలు చేశామని డబ్బాలు కొట్టుకునే అలవాటు లేదని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం నాణ్యమైన ఉచిత విద్యుత్‌ను ఇస్తున్నట్లు వివరించారు. కరోనా వైరస్‌పై కేంద్ర ప్రభుత్వం చేస్తున్న సూచనలను పాటిస్తున్నట్లు తెలిపారు. ఆస్పత్రుల్లో అన్ని వసతులు కల్పించామని చెప్పారు. కరోనా కట్టడికి అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.

బుధవారం అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల్లో భాగంగా సీఎం కేసీఆర్‌ మాట్లాడారు. పాత సచివాలయం స్థానంలో ప్రార్థనా మందిరాలు పునర్‌నిర్మిస్తామని స్పష్టం చేశారు. 39.36 లక్షల మందికి పింఛన్లు ఇస్తున్నట్లు వెల్లడించారు. భూసేకరణ ధరలు అన్ని ప్రాంతాల్లో ఒకేలా ఉండదని గుర్తుచేశారు. సంక్షేమానికి ఎక్కువ నిధులు ఖర్చు చేస్తున్నట్లు చెప్పారు. ఇంకా రాష్ట్ర గీతం నిర్ణయించలేదని తెలిపారు. గందిమళ్ల నిర్వాసితులకు గజ్వేల్‌ పక్కన ఏడున్నరవేల ఇళ్లు నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు. పోడు భూముల సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. న్యాయవాదుల హత్య కేసులో ఇప్పటికే చాలామంది అరెస్టయ్యారని గుర్తుచేశారు. ఆ హత్య కేసులో తమ పార్టీ మండల అధ్యక్షుడు హస్తం ఉందని వార్తలు రావడంతో అతడిని పార్టీ నుంచి సస్పెండ్‌ చేశామని వివరించారు. పెట్రోల్‌ ధరలను అదుపు చేయడం తమ చేతుల్లో లేదని అన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top