
ఢిల్లీ: తెలంగాణ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. కంచె గచ్చిబౌలిలో భూముల్లో చెట్ల నరికివేతపై జవాబు చెప్పాలి. పర్యావరణాన్ని పునరుద్ధరించకపోతే జైలుకి వెళ్లాల్సిందే. చెట్ల నరికివేతను సమర్థించుకోవద్దు అంటూ హెచ్చరించింది.
తెలంగాణలో కంచె గచ్చిబౌలి భూముల అంశంపై ఈరోజు మరోసారి విచారణ చేపట్టారు. చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ ఆగస్టీన్ జార్జ్ ధర్మాసనం విచారణ జరిపింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ధర్మాసనం స్పందిస్తూ.. వారాంతంలో చెట్లు నరకడంలో ఆంతర్యం ఏమిటి?. పక్కా ప్రణాళికతోనే వారాంతంలో చెట్లు నరికారు. డజన్ల కొద్ది బుల్డోజర్లు తీసుకొచ్చి చెట్లు నరికారు. సుస్థిర అభివృద్ధికి మేము వ్యతిరేకం కాదు. చెట్లు నాటకపోతే చీఫ్ సెక్రటరీపై చర్యలు ఉంటాయి. అధికారులను సమర్థించుకునే ప్రయత్నం చేయొద్దు. చెట్ల నరికివేతను సమర్ధించుకోవద్దు.. వాటిని ఎలా పునరుద్ధరిస్తారో చెప్పండి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం.
ఈ సందర్బంగా తెలంగాణ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వి.. కంచె గచ్చిబౌలిలో పనులన్నీ నిలిపి వేశామని వెల్లడించారు. పర్యావరణం కాపాడుతూనే ఐటీ ప్రాజెక్టులు చేస్తామని చెప్పారు. రిజైన్డర్స్ దాఖలు చేసేందుకు అవకాశం ఇవ్వాలని సింఘ్వీ కోరారు.

అనంతరం, విద్యార్థుల అరెస్టు అంశాన్ని ఈ కేసులో చేర్చవద్దని తెలిపింది. విద్యార్థుల అరెస్టు అంశంపై మరొక పిటిషన్‌తో రావాలని సూచించింది. తదుపరి విచారణ జూలై 23కు వాయిదా వేసింది. తాము ఈ కేసులో పర్యావరణ విషయాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకుంటున్నామని స్పష్టం చేసింది.