మా బడికి రావొద్దు.. సీట్లు లేవు 

Station Ghanpur ZPHS HM says no admissions for students - Sakshi

తేల్చిచెప్పిన స్టేషన్‌ ఘన్‌పూర్‌ జెడ్పీహెచ్‌ఎస్‌ హెచ్‌ఎం  

స్టేషన్‌ ఘన్‌పూర్‌: ‘ఇతర మండలాల పిల్లలకు సీట్లు ఇస్తే స్థానిక పిల్లలకు అవకాశం ఉండదు. అయినా ఇక్కడ సీట్లు ఖాళీ లేవు’అని చెప్పడంతో అడ్మిషన్ల కోసం వచ్చిన తల్లిదండ్రులు నిరసన తెలిపారు. ఈ సంఘటన జనగామ జిల్లా స్టేషన్‌ ఘన్‌పూర్‌ జెడ్పీహెచ్‌ఎస్‌లో సోమవారం చోటుచేసుకుంది. హనుమకొండ జిల్లా దామెర మండలం కొగిలివాయి గ్రామానికి చెందిన కన్నెబోయిన రజిని కుమార్తె జీవన (8వ తరగతి), గోల్కొండ కుమార్‌ కుమార్తె అనిత (10వ తరగతి) ప్రస్తుతం ఘన్‌పూర్‌ జెడ్పీహెచ్‌ఎస్‌లో ఇంగ్లిష్‌ మీడియం చదువుతున్నారు.

వీళ్లని ఆదర్శంగా తీసుకుని కొగిలివాయితోపాటు కమలాపూర్‌కు చెందిన నలుగురు విద్యార్థినులను వారి తల్లిదండ్రులు సోమవారం ఘన్‌పూర్‌ జెడ్పీహెచ్‌ఎస్‌ పాఠశాలలో చేర్పించేందుకు తీసుకువచ్చారు. అయితే స్కూల్‌ హెచ్‌ఎం అజామొద్దీన్‌ ‘మా పాఠశాలలో సీట్లు లేవు.. ఇప్పటికే విద్యార్థులు ఎక్కువగా ఉన్నారు. వేరే ఎక్కడైనా జాయిన్‌ చేసుకోండి’అని చెప్పడంతో వారు అవాక్కయ్యారు. హెచ్‌ఎంను బతిమాలినా వినిపించుకోవడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. దీనిపై ఆయన్ను వివరణ అడగ్గా హాస్టల్‌లో ఉండి చదివే 50 మంది విద్యార్థులు పాఠశాలకు సక్రమంగా హాజరుకావడం లేదని, విద్యార్థులు కూర్చోడానికి ఫర్నిచర్‌ లేదని తెలిపారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top