రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా పార్థసారథి

Retired IAS Officer Partha Sarathi Appointed Telangana Election Commissioner - Sakshi

నేడు బాధ్యతలు స్వీకరించే అవకాశం 

సీఎం కేసీఆర్‌తో మర్యాదపూర్వక భేటీ

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా రిటైర్డ్‌ ఐఏఎస్‌ సి.పార్థసారథిని నియమిస్తూ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ నోటిఫికేషన్‌ జారీచేశారు. మంగళవారం ఆయన్ను కమిషనర్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. అంతకుముందు కమిషనర్‌గా ఉన్న వి.నాగిరెడ్డి ఏప్రిల్‌లోనే పదవీ విరమణ చేశారు. బాధ్యతలు చేపట్టిన నాటి నుంచిమూడేళ్లపాటు పార్థసారథి ఈ పదవిలో కొనసాగనున్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా ఆయన బుధవారం బాధ్యతలు చేపడుతున్నట్టుగా అధికారవర్గాల సమాచారం. కమిషనర్‌గా నియమితులైన పార్థసారథి మంగళవారం సీఎం కేసీఆర్‌ను ప్రగతిభవన్‌లో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఆయన వెంట సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ ఉన్నారు. 

ఇదీ పార్థసారథి ప్రస్థానం... 
1993 సర్వీస్‌ కేడర్‌ ఐఏఎస్‌ అధికారి పార్థసారథి బీఎస్సీ (అగ్రికల్చర్‌), ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి ఎమ్మెస్సీ (అగ్రికల్చర్‌)–ఆగ్రోనమి డిస్టింక్షన్‌లో పూర్తిచేశారు. 1988 డిసెంబర్‌ 4న విజయనగరం ఆర్డీవోగా బాధ్యతలు చేపట్టారు. ఐఏఎస్‌గా ఆదిలాబాద్‌ జిల్లా డీఆర్‌డీఏ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌గా బాధ్యతల నిర్వహణ మొదలుపెట్టారు. అనంతరం అనంతపురం, వరంగల్‌ జిల్లాల జేసీగా విధులు నిర్వహించారు. 2004 జూన్‌ 19న కరీంనగర్‌ జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టి, 2006 జూన్‌ 6న మార్క్‌ఫెడ్‌ ఎండీగా, ఆ తర్వాత ఐఅండ్‌పీఆర్‌ కమిషనర్‌గా, 2011 జూన్‌ 18న ఏపీ స్టేట్‌ ఎయిడ్స్‌ కంట్రోల్‌ సొసైటీ పీడీగా బాధ్యతలు నిర్వహించారు. 2014 జూన్‌ 2న పౌరసరఫరాల శాఖ కమిషనర్‌గా, 2015 ఏప్రిల్‌ 15న వ్యవసాయశాఖ కమిషనర్‌గా, ఆ తర్వాత ముఖ్యకార్యదర్శిగా పదోన్నతి పొంది ఈ ఏడాది ఫిబ్రవరి 4వ తేదీ వరకు కీలకమైన బాధ్యతలు నిర్వహించారు. ఆ తర్వాత ఈపీటీఆర్‌ఐ డైరెక్టర్‌ జనరల్‌గా బదిలీపై వెళ్లి, ఈ ఏడాది ఏప్రిల్‌ 30న పదవీ విరమణ చేశారు. 

జీహెచ్‌ఎంసీ, వరంగల్, ఖమ్మం కార్పొరేషన్‌ ఎన్నికలు.. 
నాగిరెడ్డి కమిషనర్‌గా ఉండగానే సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు, గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు, కొన్ని కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు మినహా మిగతా మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికలు నిర్వహించారు. గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థలకు సంబంధించిన మెజారిటీ ఎన్నికలు ఇప్పటికే పూర్తయినందున, గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ), వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ల ఎన్నికలు కీలకంగా మారనున్నాయి. ప్రస్తుత జీహెచ్‌ఎంసీ పాలకమండలి, కార్పొరేటర్ల కాలపరిమితి వచ్చే ఫిబ్రవరి 10తో ముగుస్తుంది. దీంతో పాటు మార్చినెలలో గ్రేటర్‌ వరంగల్, ఖమ్మం కార్పొరేషన్‌ల కాలపరిమితి కూడా ముగియనుంది. సిద్దిపేట మున్సిపాలిటీకి వచ్చే ఏప్రిల్‌లో ఎన్నికలు జరగాల్సి ఉండగా, నకిరేకల్‌ గ్రామపంచాయతీ నుంచి మున్సిపాలిటీగా ఇప్పటికే మారగా, ఈ పంచాయతీ కాలపరిమితి త్వరలో ముగియగానే ఆ మున్సిపాలిటీకి కూడా ఎన్నికలు జరగాల్సి ఉంది. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో జీహెచ్‌ఎంసీ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారిన నేపథ్యంలో దాని కాలపరిమితి ముగిసే వరకు వేచి చూస్తారా లేక 2,3నెలలు ముందుగానే ఆ ఎన్నికలు నిర్వహిస్తారా అన్నది వేచి చూడాల్సి ఉంది. జీహెచ్‌ఎంసీ కాలపరిమితి ముగియడానికి మూడునెలల ముందే ఎన్నికలు నిర్వహించేందుకు చట్టంలో వెసులుబాటు ఉండడంతో ముందస్తు ఎన్నికలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందా అన్నది ఆసక్తికరంగా మారింది.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top