సండే.. ట్యాంక్‌బండ్‌ మీదే!

KTR Says To Hyderabad CP Divert The Traffic On Tank Bund sundays - Sakshi

సందర్శకులకు మాత్రమే ట్యాంక్‌బండ్‌ పైకి అనుమతి 

ప్రతి ఆదివారం సాయంత్రం 5–రాత్రి 8 గంటల మధ్య   

ఓ నెటిజనుడి సూచనలకు కేటీఆర్‌ సానుకూల స్పందన 

అవసరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులకు రీట్వీట్‌ 

కసరత్తు చేస్తున్న నగర ట్రాఫిక్‌ విభాగం అధికారులు 

సాక్షి, సిటీబ్యూరో: ఆదివారాల్లో సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ట్యాంక్‌బండ్‌ వాహనాలకు నో ఎంట్రీ జోన్‌గా మారనుంది. ఆ సమయాల్లో కేవలం సందర్శకుల్ని మాత్రమే అనుమతించేలా ట్రాఫిక్‌ పోలీసులు కసరత్తులు చేస్తున్నారు. అశోక్‌ చంద్రశేఖర్‌ అనే నెటిజన్‌ ఈ ప్రతిపాదనలను కేటీఆర్‌కు మంగళవారం ట్వీట్‌ చేశారు. ‘మంచి సలహా’ అంటూ సానుకూలంగా స్పందించిన ఆయన..నగర పోలీసు కమిషనర్‌కు రీ–ట్వీట్‌ చేశారు. ఆయన నుంచి ఆదేశాలు అందుకున్న ట్రాఫిక్‌ విభాగం అధికారులు క్షేత్రస్థాయిలో పరిస్థితులను అధ్యయనం చేస్తూ, ఈ సూచనల అమలుకు కసరత్తు చేస్తున్నారు. ఈ అంశంపై బుధవారం విస్తృత స్థాయి సమీక్ష నిర్వహించి, నిర్ణయం తీసుకోనున్నట్లు అదనపు సీపీ (ట్రాఫిక్‌) అనిల్‌కుమార్‌ తెలిపారు.  

విహార కేంద్రాల్లో కీలక ప్రాంతం.. 
నగరంలోని విహార ప్రాంతాల్లో ట్యాంక్‌బండ్‌ కీలకమైంది. ఇక్కడకు అనునిత్యం నగరానికి చెందిన వాళ్ల కుటుంబాలే కాకుండా పర్యాటకులూ పెద్ద సంఖ్యలో హాజరవుతూ ఉంటారు. లిబర్టీ వైపు ఉన్న అంబేడ్కర్‌ విగ్రహం జంక్షన్‌ నుంచి రాణిగంజ్‌ వైపు ఉన్న వైశ్రాయ్‌ చౌరస్తా వరకు 2.6 కిలోమీటర్ల పొడవుతో ట్యాంక్‌బండ్‌ విస్తరించి ఉంటుంది. ఆద్యంతం పూర్తిస్థాయిలో సరాసరిన, ఎలాంటి టర్నింగ్స్‌ లేకుండా ఉండే రహదారి ఇది. దీనిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్న ప్రభుత్వం ఇటీవల కొత్త హంగుల్ని ఏర్పాటు చేసింది. దీంతో వారాంతాల్లో వచ్చే పర్యాటకుల సంఖ్య గణనీయంగా పెరిగింది. 

ట్రాఫిక్‌తో తీవ్ర ఇబ్బందులు... 
జంట నగరాలను కలిపే కీలక రహదారుల్లో ట్యాంక్‌బంక్‌ కూడా ఒకటి కావడంతో ఈ మార్గం అనునిత్యం రద్దీగా ఉంటుంది. ఒకప్పుడు దీంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో పని దినాలతో పోలిస్తే ఆదివారం 25 శాతం ట్రాఫిక్‌ మాత్రమే ఉండేది. అయితే ఇటీవల కాలంగా వచ్చిన మార్పుల నేపథ్యంలో ఆ రోజునా ట్రాఫిక్‌ రద్దీ గరిష్టంగా 75 శాతానికి చేరుతోంది. ఫలితంగా కుటుంబాలతో ట్యాంక్‌బండ్‌ మీదికి విహారానికి వచ్చే వారికి అనేక ఇబ్బందులు వస్తున్నాయి. ఇదే విషయాన్ని అశోక్‌ చంద్రశేఖర్‌ తన ట్వీట్‌ ద్వారా కేటీఆర్‌ దృష్టికి తీసుకువెళ్లారు.  

ఆ రెండే ప్రధాన సమస్యలు... 
వాస్తవానికి చార్మినార్‌ మాదిరిగా ట్యాంక్‌బండ్‌ను కూడా పాదచారుల జోన్‌గా మార్చాలని ట్రాఫిక్‌ విభాగం అధికారులు కొన్నాళ్లుగా యోచిస్తున్నారు. అయితే అక్కడ మాదిరిగా అన్ని రోజులూ కాకుండా కేవలం ఆది వారాల్లోనే దీన్ని అమలు చేయాలని భావించారు. తాజాగా ఇదే విషయాన్ని కేటీఆర్‌ ట్వీట్‌ చేయడంతో చర్యలు వేగవంతమయ్యాయి. ట్యాంక్‌బండ్‌ను ఆదివారం సాయంత్రం వాహనాలకు నో ఎంట్రీ జోన్‌గా మార్చడానికి రెండు ప్రధాన సవాళ్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. సందర్శకుల వాహనాలను ఎక్కడ వరకు అనుమతించాలి? వీరికి పార్కింగ్‌ ఎక్కడ ఏర్పాటు చే యాలి? అనే సవాళ్ల పైనే దృష్టి పెట్టిన ట్రాఫిక్‌ పోలీసులు క్షేత్రస్థాయిలో పరిశీలన ప్రారంభించారు.  

ఏళ్లుగా నిమజ్జనం రోజు అమలు... 
ప్రతి ఏడాదీ వినాయక నిమజ్జనంతో పాటు అవసరాన్ని బట్టి ఆ మరుసటి రోజు హుస్సేన్‌సాగర్‌ చట్టుపక్కల ప్రాంతాల్లోకి సాధారణ వాహనాలు అనుమతించరు. అప్పట్లో ట్రాఫిక్‌ మళ్లింపులు చేసే ప్రాంతాలపై అధికారులు దృష్టి పెట్టారు. రాణిగంజ్‌ వైపు నుంచి వచ్చే వాహనాలను లోయర్‌ ట్యాంక్‌బండ్‌ నుంచి, రాణిగంజ్‌ వైపు వెళ్లే మార్గాలను పీవీ మార్గ్‌ మీదుగా పంపాలని యోచిస్తున్నారు. ఆయా మార్గాల్లో అధ్యయనం చేస్తున్న ట్రాఫిక్‌ విభాగం బృందాలు క్షేత్రస్థాయిలో ఎదురయ్యే సమస్యలు, చక్కదిద్దాల్సిన అంశాలను పరిగణలోకి తీసుకుని తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఖరారైన తర్వాత దీని అమలుపై నోటిఫికేషన్‌ జారీ చేస్తామని, విస్తృత ప్రచారం కల్పిస్తామని ట్రాఫిక్‌ చీఫ్‌ అనిల్‌కుమార్‌ పేర్కొన్నారు.   

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

చదవండి: Dalit Bandhu: హుజురాబాద్‌కు మరో రూ.500 కోట్ల నిధులు

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top