పట్టుబడిన అంతర్రాష్ట్ర శిశువుల అక్రమ రవాణా సూత్రధారి
గత ఏడాది అరెస్టు చేసిన చైతన్యపురి పోలీసులు
తాజాగా ఆపరేషన్ నిర్వహించిన గుజరాత్ కాప్స్
మురుగన్‌సహా నలుగురు నిందితుల పట్టివేత
నగరంలోని మూడు ఐవీఎఫ్ సెంటర్లకూ పాత్ర
సాక్షి, హైదరాబాద్: గుజరాత్‌లోని బనాస్కంత ప్రాంతంలో అపహరణకు గురైన నాలుగేళ్ల చిన్నారి దేవ్‌ను రెస్క్యూ చేయడంతో మొదలైన ఆపరేషన్‌లో భారీ శిశువుల అక్రమ రవాణా, విక్రయాల ముఠా గుట్టురట్టు అయింది. సూత్రధారులుగా ఉన్న తెలంగాణకు చెందిన ముగ్గురిని సోమవారం అరెస్టు చేసి తీసుకువెళ్లారు.
ఈ ముఠాలో కింగ్‌పిన్‌గా ఉన్న తెలంగాణకు చెందిన మురుగన్ గత ఏడాది చైతన్యపురి ఠాణాలో నమోదైన శిశువుల అక్రమ రవాణా కేసులోనూ కీలక నిందితుడిగా ఉన్నాడు. దేవ్ కిడ్నాప్‌నకు పాల్పడిన గుజరాత్‌లోని డాంత ప్రాంతానికి చెందిన శైలేష్ గామర్, బాబు భగోరాలను పోలీసులు అరెస్టు చేసి విచారించగా.. ముఠా విషయం వెలుగులోకి వచ్చింది.
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో...
‘మురుగన్ గ్యాంగ్’నెట్‌వర్క్‌ను ఛేదించేందుకు బనస్కాంత పోలీసులు దాదాపు 70 నుంచి 80 ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డు అయిన ఫీడ్‌ను సేకరించడంతోపాటు తమ వద్ద ఉన్న ఆధారాలను ఆర్టిఫీíÙయల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టూల్స్ సాయంతో విశ్లేషించారు. తెలంగాణకు చెందిన బోదాశు నాగరాజే మురుగన్ అని, అతడిపై గతంలోనూ కేసులు ఉన్నాయని గుర్తించారు.
ఇతడి కోసం గాలించిన స్పెషల్ టీమ్ సోమవారం కాగజ్‌నగర్‌లో పట్టుకుంది. మురుగన్ ఇచ్చి న సమాచారంతో కరీంనగర్ జిల్లా సిరికొండకు చెందిన కాసరపు తిరుపతి, కాసరపు మల్లయ్య, కేలేటి గంగాధర్ గంగరాజన్‌లను పట్టుకున్నారు. దాదాపు నాలుగేళ్లుగా శిశువుల అక్రమ రవాణా దందాలో ఉన్న మురుగన్ 2025 మార్చి 19న చైతన్యపురి పోలీసులు నమోదు చేసిన కేసులో అరెస్టై మూడు నెలలు చర్లపల్లి జైల్లో ఉన్నాడు.
మూడు రాష్ట్రాల్లో ఎనిమిది మంది విక్రయం...
మురుగన్ భార్యకు కూడా మహారాష్ట్రలో నమోదైన శిశువుల అక్రమ రవాణా కేసుతో సంబంధం ఉన్నట్లు బనస్కాంత పోలీసులు అనుమానిస్తున్నారు. మురుగన్ గ్యాంగ్ ఇప్పటి వరకు ఎనిమిది మంది నవజాత శిశువుల్ని అపహరించి విక్రయించినట్లు ఆరోపణలు ఉన్నాయి. హైదరాబాద్‌లోని మూడు ఐవీఎఫ్ కేంద్రాలు ఈ శిశు విక్రయాలకు అడ్డాలుగా ఉన్నట్లు బనస్కాంత అధికారులు వెల్లడించారు. సికింద్రాబాద్, బంజారాహిల్స్, కూకట్‌పల్లి కేంద్రాలుగా పనిచేస్తున్న వాటిపై చర్యలకు సన్నాహాలు చేస్తున్నారు.
గిరిజనుల బిడ్డలే ఎక్కువగా...
మురుగన్ గ్యాంగ్ గిరిజన ప్రాంతాల్లోని నిరుపేద దంపతులతో ఒప్పందాలు చేసుకుని శిశువు పుట్టిన 24 నుంచి 48 గంటల్లోనే ఖరీదు చేస్తోంది. రూ.ఐదు లక్షలు చొప్పున విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. హైదరాబాద్‌కు చెందిన సోము, అమూల్య, మల్లేష్, శివరాణి, వెంకటరామారావులతోపాటు విజయవాడకు చెందిన సరోజ పాత్ర కూడా ఉన్నట్లు గుర్తించిన పోలీసులు వారి కోసం గాలిస్తున్నారు.


