సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ మెట్రోరైల్ మొదటిదశ ప్రాజెక్టు సర్కారు స్వా«దీన ప్రక్రియ కీలకదశకు చేరుకుంది. ఎల్‌అండ్‌టీ సంస్థకు చెందిన 100% ఈక్విటీ వాటాను కొనుగోలు చేసేందుకు వీలుగా పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ శుక్రవారం జీవో నంబర్ 127ను విడుదల చేసింది. మెట్రో టేకోవర్‌కు సంబంధించిన ఆర్థిక, పరిపాలనపరమైన అంశాలకు ఆమోదం తెలిపింది. దీంతో ఈ నెలాఖరుకు మెట్రో ప్రాజెక్టు ప్రభుత్వ స్వా«దీనంలోకి రానుంది. మార్చి 30 నాటికే టేకోవర్ ప్రక్రియను పూర్తిచేయాలని భావించినప్పటికీ కొన్ని సాంకేతిక అంశాలతో పాటు, ఐఆర్‌ఎఫ్‌సీ (ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్)తో స్పష్టమైన ఒప్పందం ఖరారు కాకపోవడం వల్ల జాప్యం చోటుచేసుకుంది. అయితే ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉన్నతాధికారుల కమిటీ పలు దఫాలుగా ఐఆర్‌ఎఫ్‌సీతో, ఎల్‌అండ్‌టీ సంస్థ ప్రతినిధులతో సంప్రదింపులు జరిపింది. చివరకు మంత్రివర్గం ఆమోదించడంతో మెట్రో టేకోవర్ తుదిదశకు చేరుకుంది.
ఏడాది పాటు ఉద్యోగుల కొనసాగింపు
మెట్రో మొదటి దశ ప్రాజెక్టు (69.2 కి.మీ) కొనుగోలు విలువను మొత్తం రూ.15 వేల కోట్లుగా నిర్ధారించారు. ఇందులో భాగంగా ఎల్‌అండ్‌టీకి ఉన్న సుమారు రూ.13,615 కోట్ల రుణ భారాన్ని ఐఆర్‌ఎఫ్‌సీ రుణం ద్వారా ప్రభుత్వం చెల్లించనుంది. మిగతా రూ.1,385 కోట్లను హెచ్‌ఎండీఏ ద్వారా సమకూర్చాలని నిర్ణయించింది.
టేకోవర్ ఇలా..
ప్రస్తుతం ఎల్‌అండ్‌టీ మెట్రోలో పనిచేస్తున్న 115 మంది ఉద్యోగులను ఏడాది పాటు కొనసాగిస్తారు. మెట్రో కార్యకలాపాలపై సలహాల కోసం ఎల్‌అండ్‌టీకి చెందిన ఏడుగురు ఉన్నతాధికారుల సేవలను కూడా 6 నెలల పాటు వినియోగించుకోనున్నారు.ఐఆర్‌ఎఫ్‌సీ నుంచి తీసుకునే రుణాన్ని 20 ఏళ్ల కాలపరిమితిలో చెల్లించనున్నారు. మెట్రో నుంచి వచ్చే ఆదాయంతోనే ఈ రుణాన్ని చెల్లించనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.
ఈ భారీ రుణం కోసం ప్రభుత్వం ఐఆర్‌ఎఫ్‌సీకి గ్యా రెంటీ ఇవ్వనుంది.అలాగే ఆర్‌బీఐ ద్వారా డైరెక్ట్ డెబిట్ మాండేట్‌కు అంగీకరించింది. ఈ మేరకు ఆ సంస్థతో చేసుకోనున్న ఒప్పంద పత్రాలపై సంతకాలు చేసేందుకు హెచ్‌ఎంఆర్‌ఎల్ ఎండీకి, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శికి ప్రభుత్వం పూర్తి అధికారాలు కలి్పంచింది. ఈ ప్రక్రియ పూర్తయితే హైదరాబాద్ మెట్రో పూర్తిస్థాయిలో ప్రభుత్వ రంగ సంస్థగా మారనుంది.
రెండో దశకు మార్గం సుగమం
నగరంలోని వివిధ మార్గాల్లో మెట్రో రెండోదశ విస్తరణకు ప్రభుత్వం ఏడాదిన్నర క్రితమే సమగ్రమైన ప్రాజెక్టు నివేదికలను రూపొందించి కేంద్రానికి అందజేసింది. కానీ మెట్రో మొదటిదశ, రెండోదశల మధ్య సమన్వయంపై కేంద్రం లేవనెత్తిన పలు కీలకమైన అంశాలతో మొదటి దశ ప్రాజెక్టు చర్చనీయాంశంగా మారింది. ఎల్‌అండ్‌టీ భాగస్వామ్యాన్ని కేంద్రం ప్రశ్నించింది. ఈ క్రమంలోనే మొదటి దశ ప్రాజెక్టు నుంచి తప్పుకోనున్నట్లు గతేడాది ఎల్‌అండ్‌టీ ప్రకటించింది. తాము స్వా«దీనం చేసుకొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. అనంతరం టేకోవర్ ప్రక్రియ వివిధ దశల్లో కొనసాగింది.


