సైబర్‌ మోసాలపై ‘అర్జున’ బాణం ! | Hanumakonda Teenager Arjun Ram Develops Website to Instantly Identify Fraudsters | Sakshi
Sakshi News home page

సైబర్‌ మోసాలపై ‘అర్జున’ బాణం !

Apr 25 2026 5:00 AM | Updated on Apr 25 2026 5:00 AM

Hanumakonda Teenager Arjun Ram Develops Website to Instantly Identify Fraudsters

సెక్యూర్‌స్కామ్‌ వెబ్‌సైట్‌ను పర్యవేక్షిస్తున్న అర్జున్‌రామ్‌

మోసగాళ్లను చిటికెలో గుర్తించే వెబ్‌సైట్‌ను తయారు చేసిన హనుమకొండ టీనేజర్‌ అర్జున్‌రామ్‌ 

దానికి ఆమోదం తెలిపిన కేంద్ర సైబర్‌ క్రైమ్‌ విభాగం

హనుమకొండ చౌరస్తా: కొన్ని నెలల కిందట వాట్సాప్‌లో వచి్చన ఓ లింక్‌ను క్లిక్‌ చేసిన ఓ వ్యక్తి బ్యాంకు ఖాతా నుంచి రూ. 60 వేలు ఖాళీ కావడంతో అతను లబోదిబోమన్నాడు. దీంతో ఓ పక్కింటి కుర్రాడు పరుగున వచ్చి ఆ వ్యక్తి చేతిలోని ఫోన్‌ తీసుకొని చిటికెలో ఆ డబ్బు ఎక్కడికి వెళ్లింది.. ఎవరు మోసం చేశారో ఐపీ అడ్రస్‌తో సహా గుర్తించాడు. ఆ కుర్రాడు చేసిన సాయంతో చివరకు 24 గంటల్లోనే బాధితుడి సొమ్ము తిరిగి బ్యాంకు ఖాతాలో జమ అయింది.

ఆ కుర్రాడి వయసు అప్పుడు 16 ఏళ్లే. అతను అప్పుడు చదివేది ఇంటర్‌ ఫస్టియరే. ఓవైపు చదువు.. మరోవైపు సైబర్‌ క్రైమ్‌ను నిరోధించడానికి సొంతంగా సాధన చేశాడు. సైబర్‌ నేరగాళ్ల వలలో పడకుండా ఏం చేయాలో ఆలోచించాడు. చివరకు ‘స్కామ్‌ సెక్యూర్‌1’అనే వెబ్‌సైట్‌ను స్వయంగా రూపొందించాడు. ఆ కుర్రాడే హనుమకొండలోని నక్కలగుట్టకు చెందిన కుందారపు అర్జున్‌రామ్‌ (17).  

7 నెలల శ్రమకు ప్రతిరూపం.. 
అర్జున్‌రామ్‌ దాదాపు 7 నెలలపాటు శ్రమించి ‘స్కామ్‌ సెక్యూర్‌1’కు రూపకల్పన చేశాడు. అనంతరం ఈ వెబ్‌సైట్‌ పనితీరును క్షుణ్ణంగా పరిశీలించిన బెంగళూరులోని కేంద్ర ప్రభుత్వ సైబర్‌ క్రైమ్‌ విభాగం తాజాగా దాన్ని పబ్లిక్‌ డొమైన్‌లో అందుబాటులో ఉంచేందుకు ఆమోదం తెలిపింది. 

లాగిన్‌ అయితే చాలు.. 
స్కామ్‌ సెక్యూర్‌1 (https://scamsecure1.com/) వెబ్‌సైట్‌లో పేరు, ఈమెయిల్‌ ఐడీ, ఫోన్‌ నంబర్‌ ఇవ్వడంతోపాటు ఫోన్‌కు వచ్చే అనుమానాస్పద వెబ్‌ లింకులు లేదా మెసేజ్‌లను అందులో పేస్ట్‌ చేయగానే అవి సైబర్‌ మోసగాళ్లు పంపినవా కాదా అనే విషయాన్ని చిటికెలో తేలుస్తుంది. అలాగే అనుమానాస్పద ఫోన్‌ నంబర్లను ముందే పసిగట్టి యూజర్లను అప్రమత్తం చేస్తుంది. ముఖ్యంగా ఒకసారి పేరు, ఫోన్‌ నంబర్‌తో ఎవరైనా ఈ వెబ్‌సైట్‌లో నమోదు చేసుకుంటే భవిష్యత్తులో ఒకవేళ వారు సైబర్‌ మోసానికి గురై డబ్బు పోగొట్టుకున్నప్పుడు ఆ సమాచారాన్ని వెంటనే కేంద్ర సైబర్‌ క్రైం విభాగానికి చేరవేస్తుంది.

అలాగే సైబర్‌ నేరస్తుల ఐపీ అడ్రస్, లొకేషన్‌ను ఫొటోలతో సహా సైబర్‌ క్రైమ్‌కు పంపుతుంది. దీని సాయంతో సైబర్‌ క్రైమ్‌ విభాగం అధికారులు కేవలం 24 గంటల్లోనే కేటుగాళ్ల ఆటకట్టించి బాధితుల సొమ్మును రికవరీ చేసేందుకు వీలవుతుందని అర్జున్‌రామ్‌ పేర్కొంటున్నాడు. అలాగే నిందితులపై కేసు నమోదు అవుతుందని చెప్పాడు. ఇప్పటివరకు తన వెబ్‌సైట్‌లో 520 మంది లాగిన్‌ అయి సైబర్‌ మోసాల నుంచి భద్రత పొందినట్లు వివరించాడు.  

స్పామ్‌కాల్స్‌కు అడ్డుకట్ట వేయడంపై పనిచేస్తున్నా.. 
స్కామ్‌సెక్యూర్‌1 వెబ్‌సైట్‌ను మరింతగా అభివృద్ధి చేస్తున్నానని.. అది పూర్తయితే స్పామ్‌కాల్స్, అనవసరమైన మెసేజ్‌లు రాకుండా నిలువరించడం వీలవుతుందని అర్జున్‌రామ్‌ తెలిపాడు. కాగా, కుమారుడి ఘనతపట్ల అర్జున్‌రామ్‌ తల్లిదండ్రులు సురే‹Ù, శ్రీవాణి హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement